ఉంచుకున్నోడ్ని చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టి… ప్రియుడితో సహజీవనం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రేపల్లే మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి చిరంజీవి అనే వ్యక్తికి భార్యతో గొడవలు రావటంతో ఇంటూరు కు చెందిన శిరీష అనే మహిళతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. శిరీష ద్వారా చిరంజీవికి ఒక కొడుకు పుట్టాడు. చిరంజీవి కొల్లూరులో మెడికల్ షాపు నిర్వహించేవాడు.
కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తున్న మొదటి భార్య వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఆమెకు భరణం కింద రూ.15లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అందుకోసం తనకున్న స్ధలాన్ని అమ్మగా చిరంజీవికి రూ.20 లక్షలు వచ్చాయి.
కాగా…. చిరంజీవితో సహజీవనం చేస్తున్న శిరీష…. అతని స్నేహితుడు భాను ప్రకాష్ తోనూ లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. చిరంజీవి మొదటి భార్యకివ్వటానికి తెచ్చిన డబ్బు చూడగానే శిరీషలో దురాశ మొదలైంది. తన కొత్త ప్రియుడు భాను ప్రకాష్ తో కలిసి పాత ప్రియుడు చిరంజీవిని చంపేందుకు ప్లాన్ చేసింది. వెంటనే తన ప్లాన్ ప్రియుడికి చెప్పింది. కొల్లూరు నుంచి భాను ప్రకాష్ వెంటనే చెరుకుపల్లి వచ్చాడు.
శిరీష, భాను ప్రకాష్ కలిసి చిరంజీవిని హతమార్చారు. శవాన్ని అదే ఇంట్లో పూడ్చిపెట్టి రూ.20 లక్షలు తీసుకుని కొల్లూరు వెళ్లి జీవించ సాగారు. చిరంజీవి తండ్రి సుబ్బారావు తన కుమారుడు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
ఈ క్రమంలో చిరంజీవి సహజీవనం చేస్తున్న శిరీష వెలుగులోకి వచ్చింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరం బయట పెట్టింది. హత్య చేయటానికి సహకరించిన భాను ప్రకాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో హత్యకు ఇంకెవరెవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.