Ambedkar Statue: 206 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం.. ప్రపంచంలోనే అతిపెద్దది.. విశేషాలివిగో..
ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్నఅంబేద్కర్ విగ్రహం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.

Ambedkar Statue
దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం బెజవాడలో ఆవిష్కరణకు సిద్ధమైంది. 206 అడుగుల ఎత్తు గల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈనెల 19న ఆవిష్కరించనున్నారు.
సామాజిక న్యాయ మహాశిల్పంగా దీనికి నామకరణం చేశారు. బెజవాడకు మరో మణిహారం కానున్న ఈ విగ్రహం.. రాష్ట్రానికే కాక, దేశానికే తలమానికంగా నిలవనుంది. భావితరాలకు అంబేద్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నమని సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బెజవాడకు మరొక ప్రత్యేక మణిహారం
బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ. అదే బెజవాడకు మరొక ప్రత్యేక మణిహారంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం నిలవబోతోంది. నగరం నడిబొడ్డున గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్య మైదానంలో రూపుదిద్దుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతి వనం.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రకటించిన విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. సామాజిక న్యాయ మహా శిల్పం దర్శనీయ ప్రాంతంగా మారబోతోంది. విజయవాడలో నిర్మించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం మాత్రమే కాదు.. భావితరాలకు అంబేద్కర్ ఆదర్శాలు ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నం.
బెజవాడ బందర్ రోడ్డులోని స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్ పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం తయారయింది. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. విగ్రహ భాగాలను విడివిడిగా విజయవాడకు తరలించి స్మృతి వనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు.
విగ్రహం తయారీలో షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతతో తుది మెరుగులు దిద్దారు.
అంబేద్కర్ విగ్రహం బేస్‌లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉండగా.. ఒక్కొక్కటి 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు. మిగిలిన మూడు హాళ్లలో అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. మొదటి అంతస్తులో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్ళు ఉంటాయి. ఒక హాల్ లో అంబేద్కర్ కు దక్షిణ భారత్‌తో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసేలా ఫొటోలతో డిస్‌ప్లే చేస్తారు.
సెకండ్ ఫ్లోర్‌లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒక వైపు నుంచి వెళ్లి.. మరో వైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలు చేపట్టారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను అద్దారు.
లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేద్కర్ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి డిస్‌ప్లే చేశారు. అంబేద్కర్ రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫొటోలతో పాటు డిస్‌ప్లే చేశారు.
డిజిటల్ బోర్డులపై డిస్‌ప్లే
అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్‌ప్లే చేశారు. ‘చదువు.. సమీకరించు.. బోధించు’ వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు. మ్యూజిక్‌కు అనుగుణంగా ఎగసిపడే వాటర్ ఫౌంటెయిన్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ఫెడస్టల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్ కొలను మాదిరిగా ఫౌంటేయిన్‌ను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ స్మృతివనంలో దర్శనమిస్తాయి.
AP సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదిలీ చేశారు. స్మృతి వనం నిర్మాణాన్ని AP ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన KPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైన్లను తయారు చేసింది. 170కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు.. పూర్తయ్యేసరికి 404 కోట్ల రూపాయలకు చేరింది.
విగ్రహ నిర్మాణం జరిగే ప్రదేశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరం మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టారు. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పిలుస్తారు.
స్మృతి వనంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్ప్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెయిన్, లాంగ్ వాక్ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది. విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్‌తోపాటు కాంస్యంతో తయారు చేసిన క్లాడింగ్‌తో రూపొందించారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా దేశంలోనే తయారు చేశారు. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు.
బౌద్ధ వాస్తుశిల్పం.. కాలచక్ర మహా మండలంగా పీఠాన్ని రూపొందించారు. విగ్రహం పీఠం G+2 ఐసోసెల్స్ ట్రాపెజియం ఆకారంలో RCC ఫ్రేమ్డ్ నిర్మాణంగా చేపట్టారు. భవనం పునాదులు విగ్రహ బరువు తట్టుకునేలా పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్స్‌పై నిర్మించారు. షీర్ వాల్ గోడలు, 50 డిగ్రీల కోణంలో వంపు తిరిగిన RCC స్లాబ్‌లు, బీమ్‌లతో మొత్తం 539 పైల్స్ మీద ప్రధాన విగ్రహాన్ని నిలిపారు. విగ్రహ పీఠం ఉన్న పెడెస్టల్ బిల్డింగ్ మొత్తాన్ని రాజస్థాన్ నుంచి తెచ్చిన పింక్ ఇసుకరాయితో తాపడం వేశారు. స్మారక చిహ్నం ముందుభాగంలో 6 నీటి కొలనుల్ని ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కాలచక్ర మహా మండపం లోపల విగ్రహం కింద అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపే కేంద్రం ఏర్పాటు చేశారు. మ్యూజియం కోసం ప్రదర్శనలు సిద్ధం చేశారు. అంబేద్కర్ జీవిత కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి, స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చిదిద్దారు.
ఒకేసారి 2 వేల మంది కూర్చునేలా
భవనం బేస్‌మెంట్‌తో పాటు జి+1తో నిర్మించారు. 6వేల 340 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి 2 వేల మంది సభ్యులు కూర్చునేలా రూపొందించారు. స్మృతి వనంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించారు. ఒకేసారి 95 ఫోర్ వీలర్స్, 84 టూ వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్ట్ సైట్‌లో ఐదారు వందల మంది కార్మికులు నిరంతరం పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు రెండేళ్ల పాటు పనిచేశారు.
అంబేద్కర్‌ది ఆకాశమంతటి వ్యక్తిత్వం. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ళ క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే అంబేద్కర్ భావాల పట్ల అచంచల విశ్వాసంతో, బాధ్యతతో వాటిని నవరత్నాల్లో అనుసరిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం జగన్… అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారని ఆయన తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి అన్నారు.
ఆకాశాన్నితాకేలా విజయవాడలో కొలువుదీరనున్నఅంబేద్కర్ విగ్రహం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
YS Rajareddy Engagement: షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన అతిరథ మహారథులు.. 150 రకాల వంటకాలు..