ఆ ఒక్క మాట చెప్పలేక.. ప్రేమ, పెళ్లి మధ్య నలిగిన ఓ యువకుడి కథ..

అతడిది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే అతడిని చావుకు దగ్గర చేసింది. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి దైర్యం చాలలేదు. పెళ్లికి సిద్ధమైన మరో యువతిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ప్రేమ, పెళ్లికి మధ్య నలిగిపోతూ ఎవరికి న్యాయం చేయాలో అర్థంకాలేదు.. చివరికి తన మరణమే రెండింటికీ సమాధానమని సర్దిచెప్పుకున్నాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తున్నాననే బాధతో ఆమెను క్షమించమని కోరలేకపోయాడు. అదే దిగులుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, నిన్ను పెళ్లి చేసుకోలేనంటూ నిశ్చితార్ధమైన యువతికి క్షమాపణ చెప్పేందుకు వెళ్లిన అతడు అదే మార్గంలోని చెరువులో ప్రాణాలు వదిలాడు.
వైస్ ఆర్, కడప జిల్లాలోని నందిమండలానికి చెందిన కోపూరి గంగాధర్(27) ఇంటర్ చదివాడు. బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. కొడుకు ప్రేమ సంగతి తెలియని తండ్రి లక్షమయ్య ఓ యువతితో పెళ్లి నిశ్చయించాడు. గత నెలలో నిశ్చితార్థం కూడా జరిగింది. తొందరలోనే వివాహానికి ముహూర్తం ఖరారు చేశాడు. ఇంతలో గంగాధర్ తన ప్రేమ విషయం తండ్రికి చెప్పాడు. నిశ్చితార్ధం జరిగిన వారి ఇంటికి వెళ్లి కుమారుడితో క్షమాపణలు చెప్పించాలనుకున్నాడు.
నిశ్చితార్ధమయ్యేంతవరకు అలానే మౌనంగా ఉండి ఇప్పుడు క్షమాపణ అడగడం కరెక్ట్ కాదని గంగాధర్ భావించాడు. మానసికవేదనకు గురయ్యాడు. తండ్రి కళ్లుగప్పి పరారయ్యాడు. కుమారుడి ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. రావులపల్లె చెరువులో గంగాధర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గంగాధర్ జేబులో సెల్‌ఫోన్, ఒక పేపర్ పోలీసులకు దొరికింది. పేపరుపై తండ్రి సెల్‌ఫోన్ నెంబర్ రాసి ఉంది. పేపరు మీద ఉన్న నెంబరుకు పోలీసులు సమాచారమివ్వడంతో లక్షమయ్య చెరువు గట్టుకు చేరుకున్నాడు. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. అనంతరం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.