అందుకే సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు: జగన్ సంచలన కామెంట్స్‌

"తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి" అని జగన్ హెచ్చరించారు.

అందుకే సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు: జగన్ సంచలన కామెంట్స్‌

YS Jagan Mohan Reddy

Updated On : June 9, 2025 / 5:36 PM IST

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయడం పట్ల వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. కక్షసాధింపుల విష సంస్కృతిలో భాగంగానే ఆయనను అరెస్టు చేబుతూ ట్వీట్ చేశారు.

“అరాచకానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు.

ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు.

తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం?

Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్‌.. బస్ పాస్ ఛార్జీల పెంపు.. పెరిగిన ఛార్జీలు ఇలా..

సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు.

గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

చంద్రబాబు.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి” అని జగన్ హెచ్చరించారు.