విశాఖ జిల్లా వైసీపీ కొత్త అధ్యక్షుడిగా వీరి పేర్ల పరిశీలన.. ఎందుకంటే?

అయితే వైసీపీ అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా తేలడం లేదు.

విశాఖ జిల్లా వైసీపీ కొత్త అధ్యక్షుడిగా వీరి పేర్ల పరిశీలన.. ఎందుకంటే?

Updated On : March 23, 2025 / 4:17 PM IST

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కొనసాగుతున్నారు. అమర్‌నాథ్‌ను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది.

మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, మళ్ల విజయప్రసాద్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మళ్ల విజయప్రసాద్‌ వ్యాపార వ్యవహారాల్లో జైలుకు వెళ్లి వచ్చి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక విశాఖలో ఉండలేక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారని, అక్కడి నుంచి వచ్చి వెళ్తున్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయనకు ఇవ్వడం సముచితం కాదని జిల్లాకు చెందిన కొందరు నేతలు పార్టీ అధినేత జగన్‌కు చెప్పారట.

ఇక మిగిలిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తైనాల గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్‌ పరిశీలకుడిగా పనిచేశారు. వాసుపల్లి కూడా టీడీపీలో ఉన్న సమయంలో నగరాధ్యక్ష పదవిని చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. వీరిద్దరిలో అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై అభిప్రాయాలు సేకరించాలని ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబును వైసీపీ అధిష్ఠానం ఆదేశించింది.

Also Read: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. మంత్రి కందుల దుర్గేశ్ ఏమన్నారంటే?

ఆయన కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో కన్నబాబు ఇటీవల కీలక సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి వాసుపల్లి గణేశ్ కుమార్ లేదా తైనాల విజయ్ కుమార్లలో ఎవరైతే బాగుంటుందో నేతల నుంచి ఓపీనియన్‌ తెలుసుకున్నారు.

బలాబలాలపై బేరీజు
వాసుపల్లి గణేష్‌, తైనాల విజయకుమార్‌..బలాబలాలపై అధిష్టానం బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాసుపల్లి గణేశ్ కుమార్ విశాఖ సౌత్ నియోజకవర్గ సమన్వయర్తగా ఉన్నారు. 2009లో టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ విశాఖ నగరాధ్యక్ష పదవిని సుదీర్ఘకాలం పాటు వాసుపల్లి చేపట్టారు. వినూత్నంగా నిరసనలు చేపట్టి అధికార పక్షంపై పోరాటం చేయడంలో వాసుపల్లికి మంచి పేరుంది. వైసీపీలో జిల్లా వ్యాప్తంగా నేతలందరితోనూ సత్సంబంధాలున్నాయి.

చాలా మంది నేతలు వాసుపల్లి పేరునే తొలుత సూచించారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వాడు కావడం కూడా కలసి వస్తుందని లెక్కలేస్తున్నారు. అయితే వాసుపల్లికి ఈ పదవి చేపట్టడం ప్రస్తుతానికి ఇష్టం లేదని పార్టీ వర్గాల టాక్. తన విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని..జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ఆయన వెనకాడుతున్నట్లు చెబుతున్నారు. అయితే అధిష్టానం ఒత్తిడి చేస్తే కాదనే పరిస్థితి లేదని అంటున్నారు.

ఇక మరో నేత మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పేరు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తైనాలకు కూడా విశాఖపై పొలిటికల్‌గా గట్టి గ్రిప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నగరాధ్యక్ష పదవిని చేపట్టారు. వైసీపీలో కూడా ఇవే బాధ్యతలు గతంలో చేపట్టిన అనుభవం ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన నేత కావడం కూడా కొంత వరకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తైనాల అభ్యర్థిత్వంపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

జంపింగ్ నేతకు పార్టీ జిల్లా పగ్గాలు ఇవ్వడం సరికాదంటూ..
అందరితోనూ పరిచయాలు, మంచి స్వభావం కలిగిన నేతగా పేరున్నప్పటికీ, అధికార పక్షాన్ని నిలదీసేలా గట్టి వాయిస్ లేదనే వాదనను కొందరు తెర మీదకు తెస్తున్నారట. అంతేకాదు ఆయనకు రాజకీయంగా నిలకడ లేదని కాంగ్రెస్ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీ, మళ్లీ టీడీపీ నుంచి వైసీపీకి..ఇలా పదే పదే జంపింగ్ చేస్తున్న నేతకు పార్టీ జిల్లా పగ్గాలు ఇవ్వడం సరికాదని ఓ వర్గం తమ వాదన వినిపిస్తోందట.

అసలు తైనాల, వాసుపల్లికి కాకుండా బలమైన కొత్త నేతను గుర్తించి పగ్గాలు ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారట. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని నడపగల సత్తా ఉన్నవారికి బాధ్యతలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఉత్తర సమన్వయకర్తగా ఉన్న కే.కే.రాజు, బెహరా భాస్కర రావు, కొండా రాజీవ్ గాంధీ వంటి వారిలో ఒకరికి అవకాశం ఇస్తే పార్టీని బాగా నడుపుతారని ఇంకొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట.

అయితే వైసీపీ అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా తేలడం లేదు. వైసీపీకి అత్యంత కీలకమైన విశాఖ జిల్లా పగ్గాలను జగన్ అత్యంత సమర్థవంతుడుని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎవరిని సెలెక్ట్ చేస్తారోనన్నదివేచి చూడాలి.