Posani Krishna Murali Arrest : పోసాని అరెస్ట్ దారుణం, కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు- వైసీపీ నేతల వార్నింగ్

శివరాత్రి రోజున కూడా సీఎం చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదా?

Posani Krishna Murali Arrest : పోసాని అరెస్ట్ దారుణం, కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు- వైసీపీ నేతల వార్నింగ్

Updated On : February 26, 2025 / 11:03 PM IST

Posani Krishna Murali Arrest : సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పోసాని అరెస్ట్ ను వారు ఖండించారు. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. పోసాని అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు, లోకేశ్ ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.

”ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు. రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానని పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్రిటీష్‌ పాలనలోనే స్వేచ్చగా ఉన్నామేమోనన్న భావన ప్రజలకు కలుగుతోంది” అని మాజీమంత్రి కన్నబాబు అన్నారు.

Also Read : నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలిస్తున్న పోలీసులు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని వైసీపీ జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు. అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు అని అన్నారు. ప్రజల రక్షణ కోసం కాకుండా రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పోసాని అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు.

శివరాత్రి రోజున కూడా సీఎం చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసాని అరెస్ట్ దీనికి నిదర్శనం అన్నారాయన. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు బలిపశువులు కావొద్దని ఆయన కోరారు. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు.

‘పోసాని కృష్ణమురళి అరెస్ట్ దుర్మార్గం. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా పోలీసులు దుందుడుకుగా ప్రవర్తించడం ఏంటి? అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు. కూటమి సర్కార్ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం రాజంపేట అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట పోసానిని హాజరుపరచనున్నారు పోలీసులు.