ఆ ఇద్దరి స్థానాలపై వైసీపీ ఎమ్మెల్యేల ఆశలు!

ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించి కార్యక్రమం ఒక పక్క కొనసాగుతోంది. అసలు అదెప్పటికి అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పటి నుంచే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ అధికార వైసీపీలో మొదలైపోయింది. ఒకవేళ మండలి రద్దయితే ఆ మంత్రి పదవులను వేరే వారితో భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే వాటిని తమకు కేటాయించాలంటూ సీఎం జగన్ వద్దకు సిఫారసులతో వెళ్తున్నారట ఎమ్మెల్యేలు. అయితే కేబినెట్ కూర్పులో సామాజికవర్గాల వారీగా న్యాయం చేసే దిశగా అడుగులు వేసిన సీఎం జగన్.. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని పాటిస్తారట.
ఆ వర్గాలకే ఆ రెండు పదవులు :
ఖాళీ అవుతున్న రెండు స్థానాలు కూడా బీసీ సామాజికవర్గాలకు చెందినవే. దీంతో ఆ వర్గాలకే ఆ రెండు పదవులు కేటాయించడం ఖాయమే. కానీ, అసలు మండలి రద్దు ఎప్పటికి పూర్తవుతుందో తెలియకపోయినా ఇప్పటి నుంచే ఆ పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతుండడం విడ్డూరంగా ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మండలి సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు మంత్రి పదవులిచ్చారు జగన్. మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలి అడ్డు పడడంతో ఆగ్రహించిన జగన్.. దాని రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ప్రస్తుతం ఆ తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అక్కడ జరగాల్సిన తంతు చాలానే ఉంది.
ఖాళీ అయినట్టే.. భర్తి చేయడమే :
మరోపక్క, వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అప్పుడే ఆ రెండు మంత్రి పదవులు ఖాళీ అయిపోయినట్టుగానే లెక్కలేసుకుంటున్నారట. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టి.. ఇప్పుడు అదే వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కు అవకాశం వస్తుందంటున్నారు. ఇక సుభాష్ చంద్రబోస్ స్థానంలో కృష్ణా జిల్లా నుంచి అదే వర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే కేబినెట్ విస్తరణలో వీరిద్దరికీ అవకాశం ఉంటుందనే చర్చ పార్టీలో పెద్ద ఎత్తున సాగుతోంది. కాకపోతే కేబినెట్‌లో బీసీలు మరికొందరున్నారు కాబట్టి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట పార్టీలోని సీనియర్లు.
మంత్రిగా రోజాను నియమిస్తే :
పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న తమకు అనూహ్యంగా ఏర్పడబోతున్న ఖాళీల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారట సీనియర్లు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన కొందరికి, అలాగే పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న వారికి న్యాయం చేయాలని క్యూలో నిలబడి మరీ లాబీయింగ్ చేస్తున్నారట. ఆళ్ల రామకృష్ణ రెడ్డి, రోజా సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారట.
వైసీపీ కష్టకాలంలో ఉండగా రోజా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంతోపాటు అసెంబ్లీలో తన వాయిస్ బలంగా వినిపించారు. దీంతో అందరూ రోజాకు మంత్రి పదవి వస్తుందని ఊహించినా మొదటి దఫాలో అవకాశం దక్కలేదు. విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వడంలో మహిళా మంత్రులు విఫలమవుతున్నారని భావిస్తున్న జగన్.. మంత్రిగా రోజాను నియమిస్తే విపక్షాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు.
మంత్రి పదవిపై ఆర్కే ఆశలు :
మరోవైపు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కేకు ఎన్నికల ముందు మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. దీంతో మంత్రి పదవి ఈసారైనా వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆర్కే. మొత్తానికి మండలి రద్దవుతుందని మిగిలిన పక్షాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చెందుతున్న వేళ వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు మంత్రి పదవుల ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. ఖాళీ కాబోతున్న రెండు మంత్రి పదవులు సీఎం జగన్ ఎలా భర్తీ చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.