Midhun Reddy: టీవీ, మంచం, 3 పూటల బయటి భోజనం..! జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలివే..!
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి.
కాగా, జైల్లో తనకు పలు సదుపాయలు కల్పించాలని మిథున్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. జైల్లో టీవీ, మంచం, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్ వంటి సదుపాయాలను కల్పించాలని కోర్టును ఆయన కోరారు.
దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకల్లా అభ్యంతరాలను న్యాయస్థానానికి తెలియజేయాలంది.
ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. ఈ కేసులో ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. జైల్లో తనకు వసతులు కల్పించాలంటూ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేయగా విచారణ జరిగింది.