Nagula Chavithi: పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? తరతరాల నాగదోషాల వల్ల మీరు పడుతున్న అష్టకష్టాలను ఇలా వదిలించుకోండి..

నాగుల చవితి రోజు కత్తి చాకు లాంటి పనిముట్లు వాడకండి.. నాగదేవతలకు కోపం వస్తుంది. వండిన పదార్థాలు తినకండి. పచ్చి పదార్థాలు తినండి. ఇలా చేస్తే నాగదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది.

Nagula Chavithi: పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? తరతరాల నాగదోషాల వల్ల మీరు పడుతున్న అష్టకష్టాలను ఇలా వదిలించుకోండి..

Updated On : October 23, 2025 / 1:52 PM IST

Nagula Chavithi 2025: నాగుల చవితి రోజు (అక్టోబర్ 25-శనివారం) ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కాలసర్ప దోషాలు, రాహు కేతు దోషాలు, దేవతా సర్పాల శాపం నుంచి సులభంగా బయటపడొచ్చో చూద్దాం. అలాగే, నాగుల చవితి రోజు పాటించే విధి విధానాల వెనుక ఉన్న పౌరాణిక రహస్యాలు ఏంటో, ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో, వేదాంత రహస్యాలు ఏంటో, వైజ్ఞానిక రహస్యాలు ఏంటో తెలుసుకుందాం.

నాగుల చవితి అంటే ఏంటి? 

కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధిని నాగుల చవితి అంటారు. ఈ నాగుల చవితి శ్రావణ మాసంలో వస్తుంది, కార్తీక మాసంలో వస్తుంది. కార్తీక మాసంలో అక్టోబర్ 25వ తేదీ (శనివారం) నాగుల చవితి వచ్చింది. (Nagula Chavithi 2025)

నాగుల చవితి రోజు ఏం చేయాలి?

దగ్గరలో ఉన్న దేవాలయంలో పుట్ట దగ్గరికి వెళ్లాలి. ముందుగా పుట్ట మీద నీళ్లల్లో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లు చల్లాలి. తర్వాత బియ్యపు పిండి, పసుపు, కుంకుమ ఇవి కూడా పుట్ట మీద చల్లాలి. చల్లిన తర్వాత పుట్ట దగ్గర చక్కగా ముగ్గు వేసి, పుట్ట దగ్గర ఒక దీపం వెలిగించి, పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి ఆ తర్వాత పుట్టలో ఆవుపాలు పోయాలి.

పుట్ట మీద ఉండే మట్టి కుంకుమతో పాటు ఉన్న మట్టి తీసుకొని బొట్టులా పెట్టుకొని ఇంటికి రావాలి. ఇది మొత్తం చేయలేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్లి కాస్త పసుపు కాస్త కుంకుమ చల్లి, పాలు పోసి చలిమిడి గాని, చిమ్మిలు గాని పెట్టి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.

పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు గానీ, పుట్టకు ప్రదక్షణలు చేసేటప్పుడు గానీ ఈ కలియుగంలో వచ్చే అన్ని బాధలు పోవాలంటే ఈ శ్లోకం చదవండి..

“కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్యచ ఋతుపర్ణస్య రాజశేహే కీర్తనం కలినాశనం”

కలియుగంలో వచ్చే అన్ని బాధలు తొలగిపోతాయి. కలి బాధలు కలిపీడల నుంచి బయట పడటానికి ఈ శ్లోకం చదవాలి. రాహు కేతు దోషాలు కాలసర్ప దోషాలు, దేవతా సర్పాల శాపాలు ఉన్నవాళ్లు తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి. ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు అనంత వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబ, శంఖపాల, ధాత్ర, రాష్ట్ర, తక్షక, కాళీయ.

ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి. ఇలా పుట్టకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంతమందికి రాశి పరంగా రాహు కేతు దోషాలు ఉంటాయి. కొన్ని రాశుల వాళ్లకి రాహు కేతువులు బాలేరు అంటారు. అలా రాశి పరంగా రాహు కేతువులు బాలేని వాళ్లు మాత్రం జంటనాగుల విగ్రహాల దగ్గరికి కూడా వెళ్లండి.

దేవాలయంలో పుట్ట పూజతో పాటు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్లి ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవుపాలు పోయండి. ఆ తర్వాత నీళ్లతో కడగండి. పసుపు కుంకుమ వేయండి. పత్తి తీసుకొని ఆ పత్తిని ఒక వస్త్రంలా చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పత్తి తీసుకొని దాన్ని వస్త్రంలాగా మనం పూజల్లో చేస్తాం.

ఆ పత్తి వస్త్రాన్ని జంటనాగులకు అలంకరణ చేయండి. సువాసన కలిగిన పుష్పాలు అక్కడ ఉంచండి. మట్టి ప్రమిదలో నూనె పోసి జంటనాగుల విగ్రహాల దగ్గర దీపం పెట్టండి. ఆ తర్వాత జిల్లేడాకుల బెల్లం ముక్క జంటనాగుల విగ్రహాల పాదాల వద్ద ఉంచండి. ఆ తర్వాత జంటనాగుల విగ్రహాలకు తొమ్మిది ప్రదక్షణాలు చేయండి.

ఇలా జంటనాగుల పూజ చేస్తే రాశి పరంగా ఉన్న రాహు కేతు దోషాలు తొలగిపోతాయి. అయితే ఎవరైనా సరే పుట్ట పూజ మాత్రం నాగుల చవితి రోజు కచ్చితంగా చేయండి. చేస్తే సంతానానికి బాగుంటుంది, సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటుంది. మీ కుటుంబం వృద్ధి చెందుతుంది.

నాగుల చవితి రోజు కత్తి చాకు లాంటి పనిముట్లు వాడకండి.. నాగదేవతలకు కోపం వస్తుంది. వండిన పదార్థాలు తినకండి. పచ్చి పదార్థాలు తినండి. అప్పుడు నాగదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది.

పుట్టలో పాలు ఎందుకు పోయాలి?

అసలు పుట్టలో పాలు ఎందుకు పోయాలంటే దీనిలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అదేంటంటే పుట్టలో పాలు పోస్తున్నాం. పాముకు పాలు పోస్తున్నాం.. అంటే పాలు అంటే సత్వగుణం పాము. అంటే బుసల కొడుతుంది కాబట్టి రజోగుణం. మనలో రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది దాని వల్ల కోపం వస్తుంది. ఈర్ష్య అసూయలు వస్తూ ఉంటాయి.

అలాంటివి పోగొట్టుకోండని చెప్పటమే.. సత్వగుణం కలిగిన పాలు పుట్టలో పోయటంలో ఉన్న అంతరార్థం. ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటారు. అంటే సత్వ గుణాన్ని పెంచుకోండి మంచి గుణాలు పెంచుకోండి అని చెప్పటమే పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం.

వేదాంత రహస్యం కూడా ఉంది. వేదాంత రహస్యం ఏంటంటే.. ప్రతి మనిషికి శరీరంలో కుండలిని శక్తి అని ఉంటుంది. గొప్ప గొప్ప యోగులు దాన్ని యాక్టివేట్ చేస్తారు. అప్పుడు ఆ కుండలిని శక్తి ఇక్కడ మాడు దగ్గరికి బ్రహ్మరంద్రం దగ్గరికి వస్తుంది.

అప్పుడు వాళ్లు దేవుడితో సమానం అయిపోతారు.. అంత గొప్ప శక్తి వస్తుంది. ఈ కుండలిని శక్తి అనేది ఏ మనిషి శరీరంలోనైనా పాము చుట్టలు చుట్టుకొని పడుకున్నట్టు ఉంటుంది. ఆ కుండలిని శక్తిని మనం లేపినప్పుడు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న పాము ఒక్కసారిగా బుసగొట్టినట్టుగా ఆ కుండలిని శక్తి పైకి వస్తుంది. నీ శరీరంలో ఉన్న కుండలిని శక్తిని మేలుకొలుపు అని చెప్పటమే పాముకి పాలు పోయడంలో ఉన్న అంతరార్థం.

Note: ఈ కథనం.. విశ్వాసాలు, సంప్రదాయ పద్ధతులకు సంబంధించిన వివరణ మాత్రమే. వీటిపై నిర్ణయాలను అర్హులైన వారిని సంప్రదించి తీసుకోవాలి. ఇటువంటివి ప్రాంతీయ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. ఈ కథనంలో ఉన్న విషయాల గురించి శాస్త్రీయ నిర్ధారణ లేదు.