8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల పెంపు ఎంత ఉండొచ్చంటే?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ షాక్ తగలనుంది.

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్.. 8వ వేతన సంఘం అమలుపై కీలక అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అందరూ (8th Pay Commission) ఊహించినదాని కన్నా కనీస వేతనం తక్కువ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఈ కొత్త వేతన సంఘంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఉద్యోగులు కనీస కనీస వేతనం రూ. 18వేలు నుంచి రూ. 51వేల వరకు పెరుగుతుందని ఆశించారు.
కానీ, కొత్త నివేదిక ప్రకారం.. కనీస వేతనం చాలా తక్కువ మొత్తంలో పెరగనుంది. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం సగటున 13 శాతం పెరుగుతుంది. ఇప్పటివరకు ఉద్యోగుల కనీన వేతనం 3 రెట్లు ఉండవచ్చునని భావించారు.
కొత్త నివేదికను పరిశీలిస్తే.. ఉద్యోగుల ఆశలు ఆవిరైనట్టే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ వేతన సంఘం అమలు వెంటనే అమల్లోకి రాదు. ఎందుకంటే.. 2026 చివరి వరకు లేదా 2027 ప్రారంభానికి ముందు అమలు చేసే అవకాశం ఉంది.
కనీస వేతనం ఎంత పెరగవచ్చంటే? :
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్టు ప్రకారం.. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.8 వద్ద ఉంచవచ్చు. ప్రస్తుత జీతాన్ని 1.8తో లెక్కిస్తే కొత్త జీతం ఎంతో తెలుస్తుంది. దీని ప్రకారం.. కనీస జీతం నెలకు రూ. 18వేల నుంచి రూ. 30వేలకు పెంచవచ్చు. ఇప్పటివరకు రూ. 51,000కి పెరుగుతుందని అనేక నివేదికలు అంచనా వేశాయి. కానీ, ఈ లెక్కలను చూస్తే నిజంగా ఉద్యోగులు, పెన్షనర్లు షాక్ అవుతారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. పాత జీతం కాస్తా కొత్త పే స్కేల్‌గా మారిపోతుంది.. ఉదాహరణకు 7వ వేతన కమిషన్‌లో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దాంతో చాలా మంది ఉద్యోగుల జీతం భారీగా పెరిగింది.
అమలులో జాప్యం ఎందుకంటే? :
నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం జనవరి 2025లో 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది. కానీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఇంకా నిర్ణయించలేదు. కమిషన్ సభ్యులను కూడా నియమించలేదు. కమిషన్ రిపోర్టు రావడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్టును ఆమోదించి అమలు చేసేందుకు మరో 3 నెలల నుంచి 9 నెలల సమయం పడుతుందని కోటక్ అంచనా వేసింది.
కేంద్రంపై ఎంత భారం పడుతుంది?
కోటక్ రిపోర్టు ప్రకారం.. 8వ వేతన కమిషన్ అమలు వల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 2.4 నుంచి 3.2 లక్షల కోట్లు ఖర్చవుతుంది. GDPలో దాదాపు 0.6 నుంచి 0.8 శాతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో 90శాతం గ్రేడ్ C ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలుగుతుంది.
గత వేతన కమిషన్ల మాదిరిగానే ఈసారి కూడా వినియోగ వస్తువులు (FMCG) వంటి రంగాలలో భారీగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సేవింగ్స్ కూడా పెరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి. జీతాల పెంపుతో రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల కోట్ల అదనపు సేవింగ్స్ ఉంటుందని అంచనా. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్, బ్యాంక్ డిపాజిట్లు, ఫిజికల్ అసెట్లపై పెట్టుబడి పెట్టవచ్చు.
మరోవైపు.. ఈ నెల 21వ తేదీన పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 8వ వేతన సంఘంపై లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది శాఖ, రాష్ట్రాల నుంచి మంత్రిత్వ శాఖ సూచనలను కోరింది. కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది.
ప్రతి 10 ఏళ్లకు కొత్త వేతన సంఘం :
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల దృష్ట్యా ఉద్యోగుల జీతం, పెన్షన్‌లో మార్పులు చేస్తుంది. గతంలో 7వ వేతన సంఘం 2016 సంవత్సరంలో అమలు అయింది.