Wellness Homes: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్‌నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్

హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రెండ్ ప్రారంభమైంది.

Wellness Homes: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్‌నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్

demand for wellness home projects in hyderabad

Updated On : August 18, 2023 / 6:46 PM IST

Wellness Homes Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో (Hyderabad Real Estate) కొత్త కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. అందులోనూ నివాస సంబంధ నిర్మాణాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. కొనుగోలుదారుల అభిరుచి మేరకు బిల్డర్లు ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గతంలో కేవలం బడ్జెట్ ఇళ్లు (Budget Homes) మాత్రమే నిర్మాణం జరుపుకున్న హైదరాబాద్‌లో ప్రస్తుతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. హైరైజ్ అపార్ట్‌మెంట్స్ (highrise apartments) నుంచి లగ్జరీ హౌజెస్ (luxury houses) వరకు భారీగా నిర్మాణాలు సాగుతున్నాయి. గృహ నిర్మాణ ప్రాజెక్ట్లను ఒక్కో టైంలో ఒక్కో థీమ్తో చేపట్టడం హైదరాబాద్‌ మార్కెట్‌లో (Hyderabad Real Estate Market) సర్వసాధారణం. ఒక్కో థీమ్‌ ఒక్కో సమయంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. గేటెడ్ కమ్యునిటీ ప్రాజెక్టులు, కిడ్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు, రిటైర్‌మెంట్ హోమ్ ప్రాజెక్ట్స్.. ఇలా చాలా థీమ్స్తో నివాస ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకున్నాయి.

హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రెండ్ ప్రారంభమైంది. ప్రధానంగా మానసిక, శారీరక ఆరోగ్యకరమైన వాతావరణం, సౌకర్యాలతో కూడిన నివాస ప్రాజెక్టులనే వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టులుగా పిలుస్తున్నారు. నివాస సముదాయంలో విలాసవంతమైన సౌకర్యాలున్నా అందులో ఉంటున్నవారు ఆరోగ్యంగా లేకపోతే ఆ హంగులు, ఆర్భాటాలు ఎందుకన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అందుకే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు అనువైన వాతావరణం ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను కోరుకుంటున్నారు. వీరి కోసమే హైదరాబాద్లో చాలా మంది బిల్డర్లు వెల్‌నెస్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద వాళ్ల వరకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ఫిట్‌నెస్‌కు కావాల్సిన ఏర్పాట్ల వంటి ఎన్నో సౌకర్యాలను వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టుల్లో కల్పిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు భారీ డిమాండ్.. 20 రెట్లు పెరిగిన విక్రయాలు

ప్రధానంగా వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టుల్లో పచ్చదనానికి పెద్ద పీట వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులో సుమారు 80 శాతం విస్తీర్ణంలో పచ్చదనంతో కూడిన అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గది, స్పా, ఇండోర్ అండ్ ఔట్ డోర్ జిమ్, టెన్నిస్‌ కోర్టులు, జాగింగ్‌ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ వంటివి వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవి. అంతే కాదు ఆర్ట్‌ స్టూడియోలు, హాబీ రూమ్స్‌, జెన్‌ గార్డెన్స్‌ను నిర్మిస్తున్నారు. ఇంట్లో చిన్నారులను సైతం దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఇండోర్‌ స్టేడియం, సైకిల్‌ ట్రాక్‌, ఇంట్లో కిడ్స్ ఫ్రెండ్లీ రూమ్, టాయిలెట్‌ కమోడ్‌, పిల్లల భద్రత వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో పిల్లల నుంచి మొదలు పెద్దవాళ్ల వరకు అహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని బిల్డర్లు చెబుతున్నారు.

Also Read: అదరగొట్టిన హైదరాబాద్.. ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నివాస నగరంగా రికార్డ్

హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టులకు ఇంటి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే నిర్మాణసంస్థలు వెల్‌నెస్ హోమ్స్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 20కి పైగా వెల్‌నెస్ హోమ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. మిగతా ఇళ్లతో పోలిస్తే వెల్‌నెస్ హోమ్స్‌ ధర కాస్త ఎక్కువైనా.. ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వీటిని కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.