Gold Rate: పసిడి దూకుడు.. హైదరాబాద్‌లో రూ.90వేలు దాటిన గోల్డ్ రేటు.. కారణం ఏమిటంటే?
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 2,987 డాలర్ల కు చేరింది. దీంతో దేశీయ బలియన్ విపణిలో..

Gold Rate
Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇటీవల అంతర్జాతీయంగా, దేశీయంగా కాస్త నెమ్మదించిన బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు తొలిసారిగా రూ.90వేలు మార్కు దాటేసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 2,987 డాలర్ల కు చేరింది. దీంతో దేశీయ బలియన్ విపణిలో 10గ్రాముల మేలిమి బంగారం ధర రూ.90,450 దాటింది. మరోవైపు వెండి ధర ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. కిలో వెండి రేటు రూ.1,10,100కు చేరింది. అయితే, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల కారణంగా వచ్చే వారం రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతల పెరిగి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది. అమెరికాలోనూ ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళనలు చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారంపైకి పెట్టుబడులు మళ్లడంతో ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.