iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ ధరలు ఇప్పట్లో పెరగవు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
iPhone Prices : ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్ విధింపుతో ఐఫోన్ ధరలు భారీగా పెరగొచ్చు అనే ఆందోళన మొదలైంది. కానీ, ప్రస్తుతం ఐఫోన్‌లతో సహా ఇతర ప్రొడక్టులపై రిటైల్ ధరలు పెరిగే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి.

iPhone Prices
iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇప్పట్లో ఐఫోన్ ధరలు పెరగవు. ప్రస్తుతానికి ఆపిల్ ఐఫోన్ ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అమెరికా ట్రంప్ ప్రభుత్వం పరస్పర సుంకాలను విధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ సహా ఐఫోన్ వంటి ఇతర ఆపిల్ ప్రొడక్టుల రిటైల్ ధరలను పెంచే యోచనలో ఆపిల్ లేన్నట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఆపిల్ కంపెనీ భారత్, చైనాలోని తయారీ ప్లాంట్ల నుంచి ఐఫోన్లు సహా ఇతర ప్రొడక్టులను భారీగా అమెరికా పంపేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అగ్రరాజ్యంలో ఆపిల్ తమ స్టాక్‌లను పెంచేందుకు అధిక సంఖ్యలో షిప్‌మెంట్‌లను పంపినట్టు నివేదిక తెలిపింది.
అందులోనూ అతి తక్కువ సమయంలోనే స్టాక్ మొత్తం అమెరికాలో దింపేసిందట. అమెరికాలోని ఆపిల్ వేర్ హౌస్‌లో రాబోయే కొన్ని నెలల వరకు తగినంతగా స్టాక్ స్టోర్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. కీలకమైన తయారీ ప్లాంట్ల నుంచి ప్రొడక్టులను అత్యంత వేగంగా రవాణా చేసిందట.
ట్రంప్ సుంకాల అమలుకు ముందే :
ఏప్రిల్ 5 నుంచి బేస్‌లైన్ 10శాతం సుంకంతో ప్రారంభమై ఏప్రిల్ 9 నుంచి సంబంధిత పరస్పర సుంకాలు ప్రతి దేశానికి భిన్నంగా వర్తిస్తాయి. “భారత్, చైనా సహా ఇతర కీలక తయారీ ప్లాంట్లకు అధిక సుంకాలు అమలులోకి వస్తాయని ముందుగానే ఊహించి ఆపిల్ అమెరికాకు అన్ని ప్రొడక్టులను సర్దేసింది. తక్కువ పన్ను రేట్ల వద్ద స్టోర్ చేసిన ప్రొడక్టులపై కొత్త సుంకాల ప్రభావం పడదు.
అందుకే ముందుగానే ఆపిల్ కావాల్సినంత స్టాక్ మొత్తాన్ని అమెరికాలోని కంపెనీ స్టోర్లకు పంపేసింది. ఇలా చేయడం ద్వారా కొత్త షిప్‌మెంట్‌లకు చెల్లించాల్సిన అధిక పన్ను ధరల నుంచి ఆపిల్ తాత్కాలికంగా తప్పించుకోవచ్చు అనమాట.
ఐఫోన్లతో పాటు ఇతర ఆపిల్ ప్రొడక్టుల అమ్మకాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. కంపెనీ మొత్తం సుంకం భారాన్ని వినియోగదారులపై వేస్తే.. డిమాండ్ మందగించి కంపెనీ మార్జిన్లలో తగ్గుదల ఉంటుందనే భయాలు నెలకొన్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఆపిల్ ముందే ప్లానింగ్ ప్రకారం.. ఇతర దేశాల్లోని తయారీ ప్లాంట్లలో స్టాక్ మొత్తాన్ని అమెరికాకు పంపేసింది.
ధరల పెంపు అనేది కేవలం అమెరికా మార్కెట్‌కు మాత్రమే పరిమితం కాదు. భారత్ సహా కీలకమైన ప్రపంచ ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంటుంది. కంపెనీ సరఫరా గొలుసు, తయారీ ప్లాంట్లను ఆ దేశాలకు నిర్దేశించిన సుంకాలను దృష్టిలోపెట్టుకుని షిప్‌మెంట్ చేయాల్సి వస్తుంది. దీనిపై పూర్తి అంచనా వేసిన తర్వాత మాత్రమే ఈ తరహా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఆపిల్‌కు భారత్ మరో అతిపెద్ద మార్కెట్ :
అధ్యక్షుడు ట్రంప్ హయాంలో సుంకాల పెంపుదల ఆపిల్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో భారత్ పెద్ద వాటాను పొందే అవకాశం ఉంది. అయితే, ఆయా దేశాలతో సుంకాల రేట్లపై అమెరికా చర్చలు ముగిసిన తర్వాత తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
భారత్ అమెరికాకు చేసే దాదాపు 9 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులన్నీ ఆపిల్ నుంచే.. భారత్‌లో ఆపిల్ ప్రొడక్టుల విస్తరణ మరింత ఆకర్షణీయంగా మారవచ్చు. చైనా షిప్‌మెంట్‌లపై 54శాతం గరిష్ట సుంకంతో పోలిస్తే.. న్యూఢిల్లీపై పరస్పర సుంకం ప్రస్తుతం 26శాతం వద్ద ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా భారత్, చైనాలో ఐఫోన్‌లను తయారు చేస్తోంది.