LPG gas Prices : ఎన్నికల వేళ.. గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట..
ఎన్నికల సంవత్సరం వచ్చేసింది. దీంతో ధరలు తగ్గుతాయని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

LPG price hike Commercial cylinder rates raised by Rs 14
LPG gas Prices hike : ఎన్నికల సంవత్సరం వచ్చేసింది. దీంతో ధరలు తగ్గుతాయని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం కచ్చితంగా తగ్గుతుందని భావించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 1) ఆయిల్ సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి.
కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ ధరను రూ.14 మేర పెంచినప్పటికీ, మధ్యతరగతి ప్రజలు వాడే సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉండడం ఊరటగానే చెప్పవచ్చు. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఆఖరి సారి ఎప్పుడంటే..?
గత కొన్నాళ్లుగా సామాన్య ప్రజలు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. 30 ఆగస్టు 2023న చివరి సారిగా రూ.200 తగ్గించారు. అప్పటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే.. 2019 ఎన్నికల సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో రూ.150 కి పైగా సిలిండర్ ధర తగ్గగా ఈ ఏడాది మొదటి రెండు నెలలో ఒక్క రూపాయి కూడా తగ్గలేదు అలాగని పెరగలేదు.. స్థిరంగానే ఉన్నాయి.
Also Read : పేటీఎంకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. పేమెంట్స్ బ్యాంకు సర్వీసులపై నిషేధం.. ఎప్పటినుంచంటే?
ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ వంట గ్యాస్ ధరలో మార్పు లేకపోవడం సామాన్య జనానికి కాస్త ఊరటనే. ప్రస్తుతం ఈ సిలిండర్ల ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, హైదారాబాద్‌లో రూ. 955 వద్ద కొనసాగుతోంది.
వాణిజ్య సిలిండర్ల పై బాదుడు..
14కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పై రూ.14 పెరిగింది. పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ధరలు పెరిగిన తరువాత వాణిజ్య సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1769, కోల్‌కతా రూ.1887, ముంబై రూ.1723, చెన్నైలో రూ.1937గా ఉంది.