మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం..? ఇండియాలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయా?
భారత్‌లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు.

భారత్‌లో దాదాపు పదేళ్ల తరువాత ఇప్పుడు కొత్త బ్యాంకుల లైసెన్సుల జారీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీని కోసం కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు కలిసి బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించేందుకు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
పలు పెద్ద కంపెనీలకు షేర్‌హోల్డింగ్ పరిమితులతో బ్యాంకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చేందుకు ప్రోత్సహించడం వంటి అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడిదారుల వాటాను పెంచేందుకు అవకాశాలను సులభతరం చేయనుంది.
భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెద్ద బ్యాంకుల ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఆర్థిక శాఖ, ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, మార్కెట్లో దీని ప్రభావం కనపడింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ప్రారంభంలో 0.8% నష్టాన్ని చూపించినా, మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో 0.5% లాభంతో ముగిసింది.
భారత్‌లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు. 2016లో బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం విధించారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలకు బ్యాంకులను ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడాన్ని చాలా కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇంకా చిన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద సంస్థలుగా మలచాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత్‌లోని కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించే అవకాశం కూడా ఉంది. దక్షిణాదిన ఆపిల్ వంటి సంస్థలు తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే ప్రపంచంలో టాప్ 100 బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. చైనా, అమెరికా బ్యాంకులు టాప్ 10లో ఆధిపత్యం చాటుతున్నాయి.
భారత బ్యాంకింగ్ రంగం ప్రపంచంలో అత్యంత నియంత్రణలో ఉన్న వ్యవస్థలలో ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దీన్ని సాధించేందుకు బ్యాంక్ రుణాలు జీడీపీలో 56% స్థాయి నుంచి 130% స్థాయికి చేరాలని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
మౌలిక వసతులు, తయారీ రంగానికి రుణాలు ఇచ్చే సామర్థ్యం ఉండే బ్యాంకులు అవసరం. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ బ్యాంకులను భద్రతా పరంగా మెరుగైనవిగా భావిస్తారు.
మేలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా లైసెన్సింగ్ విధానాన్ని పునఃసమీక్షిస్తున్నామని చెప్పారు. అలాగే, భారత బ్యాంకులను పెంచే మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.