Business News: దేశంలో 7 లక్షల కారు ఆర్డర్లు పెండింగ్
భారత్ లో వినియోగదారులకు చేరవలసిన 7 లక్షల కార్లకు సంబందించి ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే ద్వారా వెల్లడైంది.

Chips
Business News: భారత్ లో వినియోగదారులకు చేరవలసిన 7 లక్షల కార్లకు సంబందించి ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే ద్వారా వెల్లడైంది. 2021-22కి గానూ చేపట్టిన ఈ ఆర్ధిక సర్వేలో.. దేశ ఆర్ధిక రంగానికి ఊతమిచ్చే పారిశ్రామికోత్పత్తి సహా ఇతర అంశాలపై నివేదిక రూపొందించారు. నివేదిక ప్రకారం 2021 డిసెంబర్ చివరి నాటికే భారత్ లో 7 లక్షలకు పైగా కార్ల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. దేశంలో తీవ్ర స్థాయిలో “మైక్రో చ్ఛిప్స్” కొరత ఉండడమే ఇందుకు కారణమని సర్వేలో పేర్కొన్నారు. డిసెంబర్ 2021లో దేశ వ్యాప్తంగా 2,19,421 కార్లు వినియోగదారులకు చేరాయని.. ఇది 2020 డిసెంబర్ తో పోలిస్తే 13 శాతం తక్కువని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (SIAM) పేర్కొంది.
Also Read: Canada PM trolled” “కర్మ అనుభవించక తప్పదు” కెనడా ప్రధానిపై భారతీయుల ట్రోలింగ్
కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మైక్రో చిప్స్ కు కొరత ఏర్పడింది. అదే సమయంలో కరోనా కారణంగా సొంత వాహనాలు కొనుగోలుచేసేందుకు వినియోగదారులు ఉత్సాహం కనబరిచారు. ఇక కార్ల తయారీ సంస్థలు సైతం కొత్త కొత్త మోడల్స్ తో వినియోగదారులను ఊరించారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా కార్లను కొనుగోలు చేసేందుకు షోరూములకు చేరుకున్నారు కస్టమర్లు. దీంతో సప్లై డిమాండ్ సమస్యలు వచ్చిపడ్డాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన కార్లను డెలివరీ చేసేందుకు మోడల్, తయారీ సంస్థను బట్టి గరిష్టంగా 14 వారాల సమయం పట్టింది.
Also read: IPL 2022: అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నానంటోన్న మిచెల్ స్టార్క్
దేశంలో కార్ల తయారీ సంస్థల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుతం.. వారికి ఊరటనిచ్చేలా సెమీకండక్టర్ పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకెజీ ప్రకటించింది. త్వరితగతిన సెమికండక్టర్లు, డిస్ప్లే యూనిట్ ల తయారీకి రూ.76 వేల కోట్ల ఆర్ధిక ప్యాకెజీ అందించింది ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా సెమికండక్టర్ల పరిశ్రమలు డీలా పడిపోయిన సమయంలో భారత్ లో చిప్ ల ఉత్పత్తి పెంచే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత ఊరటనిస్తున్నా..ముడిసరుకు దిగుమతులు, వేగవంతమైన తయారీ విషయాలు ప్రశ్నర్ధకంగానే ఉన్నాయి. కార్ల కొనుగోలుకై వినియోగదారుల నుంచి వస్తున్న ఈ డిమాండ్ ను ఇప్పుడు చేజిక్కించుకోకపోతే.. భారత వాహనరంగం కుదేలయ్యే పరిస్థితి ఉందంటూ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also read: Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు