ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ను జుకర్‌బర్గ్ అమ్మేస్తారా? ఎందుకంటే?
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.

Mark Zuckerberg
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాపై వాషింగ్టన్‌లో సోమవారం యాంటీట్రస్ట్ విచారణ ప్రారంభమవుతుంది. యాంటీట్రస్ట్ అంటే మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడంతో పాటు గుత్తాధిపత్యం, చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులను నిరోధించడానికి ఏర్పాటు చేసిన చట్టాలు. ఇవి వినియోగదారులు నష్టపోకుండా చూస్తాయి.
మెటా కంపెనీ చాలా పవర్‌ఫుల్ కావడంతో ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తోందని, ఆ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ను విక్రయించాలని అమెరికా ప్రభుత్వ సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఒత్తిడి చేస్తోంది.
ఈ విచారణ 37 రోజుల వరకు కొనసాగవచ్చు. మెటా వంటి పెద్ద టెక్ కంపెనీల అధికారాన్ని, పవర్‌ను ఓ స్థాయికి పరిమితం చేయడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యల్లో ఇది ఒకటి. మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.
మార్కెట్లో పోటీ లేకుండా చేయడానికి, పర్సనల్ సోషల్ నెట్‌వర్కింగ్ రంగంలో చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి మెటా సంస్థ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కొన్నదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపిస్తోంది.
మార్కెట్లో పోటీ పడటం కంటే కంపెనీలను కొనడం మంచిదని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ఒక ఈ-మెయిల్‌తో పాటు మెటాకు సంబంధించిన పలు ఈ-మెయిల్‌లను ఎఫ్‌టీసీ ఆధారాలుగా చూపుతోంది. కొత్త ఐడియాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కంటే కంపెనీలకు కొనడమే మంచిదని మెటా భావించిందని దీని ద్వారా తెలుస్తోందని ఎఫ్‌టీసీ అంటోంది.
ఈ యాంటీట్రస్ట్ కేసు విచారణ వాషింగ్టన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బోయాస్‌బర్గ్ నేతృత్వంలో జరుగుతోంది. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు. అమెరికాలో పర్సనల్ సోషల్ నెట్‌వర్కింగ్ సేవలపై మెటాకు గుత్తాధిపత్యం ఉందా? లేదా? అన్న విషయాన్ని న్యాయమూర్తి మొదట నిర్ణయిస్తారు.
పర్సనల్ సోషల్ నెట్‌వర్కింగ్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ప్రజలు ఈ యాప్‌లను వాడుతుంటారు. యూట్యూబ్, టిక్‌టాక్ వంటివి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు భిన్నంగా పనిచేస్తున్నాయని ఎఫ్‌టీసీ అంటోంది.
యూట్యూబ్, టిక్‌టాక్ క్రియేటర్ల నుంచి వచ్చే వీడియోలపై ఎక్కువ దృష్టి పెడతాయని చెబుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రం యూజర్లు పర్సనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పింది. కాబట్టి ప్రాథమికంగా ప్రజలు వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా మార్కెట్‌ను మెటా నియంత్రిస్తుందా? లేదా? అనేది మొదట కోర్టు నిర్ణయించాలి.