మీ డబ్బులకు నేను హామీ : నిర్మలా సీతారామన్ భరోసా

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కృషిచేస్తోందని ఆమె తెలిపారు.
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో నాలుగవదిగా ఉన్న యెస్ బ్యాంకు ప్రస్తుతం కొత్త రుణాలిచ్చేందుకు నిధుల్లేక తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నిధుల సమీకరణ ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు యెస్ బ్యాంకు తాజాగా చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో గురువారం ఆ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది.
దీనితో పాటు ఖాతాదారులు నెలలో రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని కూడా పరిమితి విధించింది. దీంతో యెస్ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభంపై తాను ఆర్బీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆర్బీఐ తనకు హామీ ఇచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
యెస్ బ్యాంక్ లిమిటెడ్ రీకన్ స్ట్రక్షన్ స్కీమ్ 2020 ముసాయిదాను ఆర్ బీఐ ప్రకటించింది. దాని ప్రకారం.. వ్యూహాత్మక పెట్టుబడుదారు బ్యాంకు 49 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. రూ.10 తక్కువకు కాకుండా షేరును కొనాల్సి ఉంటుంది. ప్రీమియం రూ.8 వరకు ఉండొచ్చని ఆ ముసాయిదాలో తెలిపింది. ఇంకా.. మూలధనం వచ్చిన తేదీ నుంచి మూడేళ్ల లోపు ఆ వాటా 26 శాతంలోపు చేరడానికి వీలులేదు.
అదే సమయంలో బ్యాంకు అధీకృత మూలధనం రూ.5,000 కోట్లుగా ఉంటుంది. రూ.2 ముఖ విలువ గల 2400 కోట్ల ఈక్విటీ షేర్లుంటాయి. కాగా, ఈ ముసాయిదాపై అందరి అభిప్రాయాలను మార్చి 9 వరకు స్వీకరిస్తారు. కాగా, యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి.. పునర్నిర్మాణ పథకంలో పాల్గొనడానికి ఎస్ బీఐ సంసిద్ధతను వ్యక్తం చేసిందని ఆ ముసాయిదా తెలిపింది
‘ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉన్నది. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో ఏ ఒక్కరికీ నష్టం జరుగదని నేను హామీ ఇస్తున్నా. నిర్దేశిత పరిమితికి లోబడి తమ సొమ్మును ఉపసంహరించుకొనేలా డిపాజిటర్లకు వీలుకల్పించడమే మా ముందున్న తక్షణ ప్రాధాన్యం. ఈ విషయమై రిజర్వు బ్యాంకుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
డిపాజిటర్లతోపాటు బ్యాంకులు, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను కాపాడేందుకే తాజా చర్యలు చేపట్టాం. డిపాజిటర్లకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు రూ.50 వేలు ఉపసంహరించుకొనే అవకాశాన్ని కల్పించాం’ అని ఆమె వివరించారు. యెస్ బ్యాంకుకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేయనున్నామని, ఆ బ్యాంకులో 49 శాతం పెట్టుబడులు పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తి చూపిందని తెలిపారు.
యెస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం 2017లోనే అప్రమత్తమైందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ బ్యాంకులో పాలనాపరమైన సమస్యలున్నట్టు అప్పుడే గుర్తించి సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచించామని తెలిపారు. ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి జీతాలకు ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం బలవంతపు విలీనాలతో దేశ బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందని నిర్మలా సీతారామన్ విమర్శించారు.
యెస్ బ్యాంకు ఇపుడు ఏ రుణాన్ని ఇవ్వలేదు. పాత రుణాన్ని రెన్యువల్ చేయనూ లేదు. ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదు. ఎటువంటి బకాయిలు కూడా చెల్లించనక్కర్లేదు. ఇక వచ్చే నెల రోజుల వరకు ఆర్ బీఐ నియమించిన పాలనాధికారి ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో యెస్ బ్యాంకు నడుస్తుంది.
యెస్ బ్యాంకు ను ఫ్యూచర్స్ అండ్ఆప్షన్స్ విభాగం నుంచి తొలగించాలని BSE, NSE, నిర్ణయించాయి. మే 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మే 28న అన్నిప్రస్తుతకాంట్రాక్టులు గడువు తీరుతాయి. ప్రస్తుతం F&O విభాగంలో 200 కంపెనీల స్టాక్స్ ఉన్నాయి.
See Also | దిశ హత్యాచార కేసు : చెన్నకేశవులుకు ఆడపిల్ల పుట్టింది