పేలిన నాటు బాంబు

police seize explosives in jangampalli village : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో శుక్రవారం నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. బాంబు పేలిన ఇంటిలో…జంట హత్యల కేసులో నిందితుడు నివసిస్తూ ఉండటంతో గ్రామస్ధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అక్టోబర్ 30, శుక్రవారం సాయంత్రం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లూరి సిధ్ధరాములు (50) అనే వ్యక్తి ఇంట్లో నాటు బాంబులు పేలి ఇంటి పైకప్పు ధ్వంసం అయ్యింది. బాంబులు పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నీటిలో తడిసిన నాటు బాంబులను ఎలక్ట్రిక్ బల్బుతో వేడి చేస్తుండగా పేలినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు.
ఇంట్లో సోదాలు నిర్వహించి మరికొన్ని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి పందులను వేటాడేందుకు వీటిని తీసుకువచ్చి భద్రపరిచినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. కాగా….. సిధ్ధరాములు గతంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు కావటం గమనార్హం.