అల్లుడ్ని సజీవ దహనం చేసిన అత్తింటివారు

  • Published By: murthy ,Published On : November 24, 2020 / 10:59 AM IST
అల్లుడ్ని సజీవ దహనం చేసిన అత్తింటివారు

Updated On : November 24, 2020 / 11:25 AM IST

software engineer killed in jagtial district : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేయించాడనే అనుమానంతో ఇంటి అల్లుడ్ని అత్తింటి వారు సజీవదహనం చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. మల్యాలమండలం బల్వంతపూర్ శివారు లో ఉన్న మంజునాధ ఆలయ గదిలో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్, ఆల్వాల్ కు చెందిన పాగిళ్ల పవన్‌ కుమార్ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణి అనే యువతితో వివాహమైంది.

కృష్ణవేణి సోదరుడు జగన్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. గతంలో జగన్, పవన్ కుమార్‌ల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అయినా అవన్నీ మర్చిపోయి అత్తింటి వారిని పరామర్శించేందుకు పవన్ అత్తింటికి వచ్చాడు.



ఈ క్రమంలో బావమరిది మృతికి పవన్ కుమారే కారణం అని జగన్ భార్య సుమలత అనుమానించింది. గతంలో ఉన్న గొడవలు దృష్టిలో పెట్టుకునే, పవన్ చేతబడి చేయించి మంత్రాలతో జగన్ ను చంపించాడని సుమలత భావించింది.

పవన్ , పరామర్శించటానికి వచ్చినప్పుడు మంచినీళ్లు తెమ్మని తనను బయటకు పంపించి తన భర్తను గదిలో బంధించి సుమలత పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిందని మృతుడి భార్య కృష్ణవేణి భోరున విలపిస్తూ ఆరోపించింది. సమాచారం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీవెంకరమణ, సీఐ కిషోర్‌, ఎస్సై నాగరాజు, శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సజీవ దహనంపై వివరాలు సేకరిస్తున్నారు.