అక్కతో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడని….ఆమె ఆరేళ్ల తమ్ముడ్ని హత్య చేసిన ప్రియుడు

ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడని ఆమె ఆరేళ్ల తమ్ముడిని ఓ ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. ఈ విషయం ఆలస్యం గా వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసారు.
బరేలి జిల్లాలోని ఈద్జాగిరి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. గ్రామంలో కూలి పని చేసుకుని నివసించే ఓ కుటుంబంలోని దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ ఉదయం పనికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో మైనర్ కుమార్తె ప్రియుడు ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో ఇంట్లో ఆమె తమ్ముడు ఆడుకోటానికి బయటకు వెళ్లటంతో వీరిద్దరే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రేయసి ప్రియులిద్దరూ సన్నిహితంగా మెలగసాగారు. అదే సమయంలో ఉన్నట్టుండి ఆరేళ్ల వయస్సున్న ఆమె తమ్ముడు ఇంట్లోకి వచ్చాడు. అది చూసి ఇద్దరూ కంగారు పడ్డారు. తమ ఇద్దరి సంబంధం పెద్దవాళ్లకు చెపుతాడేమోనని భయపడ్డారు.
వెంటనే ఆమె ప్రియుడు బాలుడ్ని దగ్గరకు తీసుకుని పీక పిసికి ఊపిరాడకుండా హత్య చేశాడు. ఉదయం పనికి వెళ్లిన తల్లి,తండ్రులు సాయంత్రం పని నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. పైనుంచి కిందపడి తమ్ముడు చనిపోయాడని బాలిక వారికి చెప్పటంతో…. వారు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కాగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
రెండు రోజులు గడిచాయి. బాలిక మనసులో ఏదో బాధ ఉంది. తాను దోషినని మధన పడసాగింది. ఆ టెన్షన్ తట్టుకోలే గురువారం నాడు బాలిక తల్లి, తండ్రులకు నిజం చెప్పింది. జరిగిన విషయం తల్లితండ్రులకు వివరించింది.బాలిక ఇచ్చిన సమాచారంతో తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికపై, ఆమె ప్రియుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యం కనిపించకుండా పోవడం), 120 బి (క్రిమినల్ కుట్ర) కింద కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ అయినందున ఆమెను జువైనల్ కోర్టులో హజరు పరచనున్నారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు కోసం గాలిస్తున్నట్లు బరేలీ ఎస్ఎస్పి శైలేష్ పాండే చెప్పారు. బాలుడి మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష చేయనున్నారు.