Illegal Abortions : కరీంనగర్ జిల్లాలో అబార్షన్ల దందాపై 10టీవీ స్పెషల్ ఆపరేషన్ ..

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో యథేచ్చగా అబార్షన్ల దందా నడుస్తోంది. దీనిపై 10టీవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. జమ్మికుంట ఆస్పత్రులు అబార్షన్లకు అడ్డాగా మారాయని తెలుసుకున్న 10టీవీ రహస్య ఆపరేషన్ నిర్వహించింది

Illegal Abortions : కరీంనగర్ జిల్లాలో అబార్షన్ల దందాపై 10టీవీ స్పెషల్ ఆపరేషన్ ..

10TV secret operation on Illegal abortions

Updated On : October 13, 2022 / 12:14 PM IST

10TV secret operation on Illegal abortions : లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఈ పరీక్షలు నిర్వహించినట్టు తేలితే కఠినశిక్షలు అనుభవించక తప్పదు. అందుకే వైద్యులు ఈ పరీక్షలు చేయడానికి నిరాకరిస్తుంటారు. పుట్టబోయే బిడ్డ ఆడా..మగా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా నేరం. ఈ విషయంలో డాక్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా పుట్టబోయే బిడ్డ…ఆడా మగా అన్నది వెల్లడించరు. కానీ కొందరు అక్రమార్కులైన డాక్టర్లు మాత్రం దీన్నో ఆదాయవనరుగా చూస్తున్నారు. పుట్టబోయేది అమ్మాయి అని తేలితే కమిషన్లకు కక్కుర్తి పడి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా యథేచ్చగా అబార్షన్ల దందా నడుస్తోంది. దీనిపై 10టీవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. జమ్మికుంట ఆస్పత్రులు అబార్షన్లకు అడ్డాగా మారాయని తెలుసుకున్న 10టీవీ రహస్య ఆపరేషన్ నిర్వహించింది. అబార్షన్ గురించి ఆరా తీయగా..మొదట సందేహంగా మాట్లాడిన ఆర్‌ఎంపీలు తర్వాత..మహిళను తీసుకురావాలని 10టీవీ ప్రతినిధులను కోరారు. 10టీవీ సీక్రెట్ ఆపరేషన్ లో ఇటువంటి దందాలు ఎన్నో బయటపడ్డాయి.

ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహస్య అబార్షన్లు నిర్వహించేవారు ఎందరో. డాక్టర్లు, ఆర్‌ఎంపీలు, స్థానిక ఏజెంట్లు కలిసి చేస్తున్న దందా గర్భస్థ ఆడశిశువులకు మరణ శాసనం రాస్తోంది. సమాజం ఎంత విజ్ఞానవంతమవుతున్నా….అమ్మాయంటే చులకనభావం పోవడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు అన్ని రంగాల్లో ఒకేలా రాణిస్తున్నా…భ్రూణ హత్యలు ఆగడం లేదు. ఎవరు పుట్టినా ఒకటే అని భావించని తల్లిదండ్రులు…మగపిల్లల కోసం ఆరాటపడడం…కొందరు ప్రయివేట్ వైద్యులకు వరంగా మారింది. భ్రూణహత్యలతో కాసుల పంట పండించుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ ఏటా కోట్లరూపాయలు దండుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

లింగనిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్నప్పటికీ…కొందరు తల్లిదండ్రులు..పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఎవరు పుడతారోనన్న ఆతృత కొందరిదయితే….ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే దుర్మార్గపు ఆలోచన మరికొందరిది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు…..కొందరు వెంటనే అబార్షన్లకు సిద్ధమవుతున్నారు. ఈ రహస్య అబార్షన్లు..డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట ప్రయివేట్ ఆస్పత్రులు లింగనిర్ధారణ పరీక్షలు, ఇల్లీగల్ అబార్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. జమ్మికుంటలో మొత్తం ఏడు నర్సింగ్‌ హోంలున్నాయి. వాటిలోనే స్కానింగ్ సెంటర్లున్నాయి. దీంతో స్కానింగ్ నిర్వహించిన అనంతరం అమ్మాయని తేలితే అక్కడే అబార్షన్లు నిర్వహిస్తున్నారు. ఈ దందాల ఆర్‌ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి మధ్యవర్తిత్వంతోనే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి గర్భిణులు అబార్షన్ల కోసం ఈ ఆస్పత్రులకొస్తున్నారు.

అబార్షన్ చేయటానికి ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు..
లింగ నిర్ధారణ పరీక్షలు చేసి..అబార్షన్ చేయటానికి ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు చేస్తున్నాయి నర్శింగ్‌హోమ్‌లు. జమ్మికుంట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు వైద్యులుగా కన్నా కమిషన్ ఏజెంట్లగానే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇక్కడ జరిగే మరో దారుణం..కొన్నిసార్లు స్కానింగ్‌లో అమ్మాయన్న విషయం స్పష్టంగా తేలకపోయినా…అబార్షన్ డబ్బుల కోసం గర్భస్థ శిశువు అమ్మాయే అని చెబుతున్నారు కొందరు వైద్యులు. అబార్షన్ పూర్తయ్యాక అసలు విషయం తెలిసినా తల్లిదండ్రులు ఏం చేయలేక తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు.

ఆడపిల్లా? మగపిల్లాడా అని చెప్పటానికి కోడ్ లాంగ్వేజ్..
అసలు లింగనిర్ధారణ చేయడం, ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా..ఈ రెండింటినీ కలిపి ఓ ఆఫర్ ప్రైజ్ కూడా ఈ నర్సింగ్ హోమ్‌లు అమలుచేయడం. ఆర్‌ఎంపీల మధ్యవర్తిత్వం లేకుండా వచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపినప్పటికీ పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్నది చెప్పరు. ఆర్‌ఎంపీ ద్వారా వస్తే మాత్రం…పుట్టబోయేది ఎవరో తెలుసుకోవడం చిటికెలో పని. అయితే ఇది చట్టరీత్యా నేరం కాబట్టి…ఎవరూ నేరుగా మాట్లాడుకోరు. ఎలాంటి వైద్య పరమైన రసీదులూ ఉండవు. పుట్టబోయేది ఎవరో తెలుసుకునేందుకు డాక్టర్లకు, రోగులకు మధ్య ఓ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. చిటికెనవేలు చూపిస్తే అబ్బాయని, రెండు వేళ్లు చూపిస్తే పాప అన్నది అక్కడికి వచ్చిన అందరికీ అర్ధమవుతుంది. ఆర్‌ఎంపీలు అనేకమంది ప్రయివేట్ నర్సింగ్ హోమ్‌లకు కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు,ఆడపిల్లంటే చిన్నచూపు, ప్రజల్లో అవగాహనారాహిత్యం వంటివి ఆర్‌ఎంపీలకు, అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకునే డాక్టర్లకు వరంగా మారుతున్నాయి.

డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏ బిడ్డో తెలియకపోయినా ఆడపిల్లే అని చెప్పేస్తున్న డాక్టర్లు..
1994లోనే అబార్షన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. కానీ ఇన్నేళ్లయినా ఈ అక్రమాలకు మాత్రం తెరపడడం లేదు.స్కానింగ్‌లో అమ్మాయిని తెలిస్తే…రెండువేళ్లు, చిటికెన వేలయితే అబ్బాయని డాక్టర్లు సైగలు చేస్తారు. అమ్మాయని తెలుసుకున్నవాళ్లల్లో ఎక్కువమంది అబార్షన్‌కు సిద్ధమైపోతుంటారు. ఇక ఈ విషయంలో డాక్టర్లు, ఆర్‌ఎంపీలు కలిసి మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు స్కానింగ్‌లో గర్భస్థ శిశువు ఆడా..మగా అన్న విషయం స్పష్టంగా తెలీదు. అయినా సరే అబార్షన్‌తో ఎక్కువ డబ్బులొస్తాయని కక్కుర్తిపడి ఆడపిల్లే అని తేల్చేస్తారు. వారి మాటలు నమ్మి అబార్షన్ చేయించుకున్న మహిళలకు తర్వాత అసలు విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.

అబార్షన్లు నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోందనే విమర్శలు
అబార్షన్లు నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ, ఇతర అనుబంధ శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తొలి కాన్పులో కూతురుని కని..రెండోసారి గర్భందాల్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాలని సామాజిక నిపుణులు అంటున్నారు. ఆశ కార్యకర్తలు, ANMలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు ద్వారా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిఉన్నా ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. గర్భిణులు ఎన్ని సార్లు స్కానింగ్ తీయించుకున్నారు..ఎక్కడ తీయించుకున్నారు వంటి వివరాలతో పాటు స్కానింగ్ సెంటర్ల నుంచీ వివరాలు సేకరించాల్సిన అవసరముంది. అయితే ఈ విభాగాల మధ్య సమన్వయ లోపంతో….ఆడబిడ్డలు ఈ లోకం చూడకుండానే తల్లి కడుపులో కన్నుమూస్తున్నారు.