ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

Acb Raids

Updated On : July 1, 2021 / 6:12 PM IST

ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల  లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళితే …చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతి శెట్టి, వెంకట రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నర్సాపురంలో 1.66 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. భూ మార్పిడి చేసేందుకు గత నెల రోజులుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్ రవికుమార్ భూమి మార్పిడి చేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకి ఇద్దరి మధ్య బేరం రూ.4.50 లక్షల వద్ద సెటిల్ అయ్యింది. అలాగే నర్సీ పట్నంలోని 50 సెంట్ల భూమిని కన్వర్షన్ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ రూ. 50 వేలు డిమాండ్ చేశాడు.

పది రోజుల క్రితకమే బాధితులిద్దరూ ఏసీబీని  ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనలతో రవికుమార్ తహసీల్దార్‌కు  ఫోన్ చేశాడు. డబ్బు సిధ్దం చేశానని ఎక్కడకు తీసుకురావాలో చెప్తే  అక్కడకు వచ్చి అంద చేస్తానని చెప్పాడు.  డైరెక్ట్ గా కార్యాలయానికి  రావద్దని తన కారు డ్రైవర్ కు ఇవ్వాలని తహసీల్దార్ చెప్పారు.

రవికుమార్ డ్రైవర్ కు డబ్బు ముట్ట చెప్పాడు. అప్పటికే  కార్యాలయం వద్ద కాపు కాసిన ఏసీబీ అధికారులు… డ్రైవర్ వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్న  తహసీల్దార్ ను, డిప్యూటీ తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.