మ్యారేజి బ్యూరో పేరిట రూ.15 కోట్లు మోసం

మ్యారేజ్ బ్యూరో లో డబ్బులు పెడితే బాగా లాభాలు ఆర్జించవచ్చని… రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 5రూపాయల వడ్డీతో పాటు.. ఏడాది తర్వాత అసలు తిరిగి తీసుకోవచ్చని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసగాడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
టోలీ చౌక్ లో ఉండే షేక్ మహమూద్ మూడేళ్ళకిందట అల్ మదీనా మ్యారేజి బ్యూరో పేరిట పెళ్ళి సంబంధాలు చెప్పే సంస్ధను స్ధాపించాడు. అది బాగా ప్రాచుర్యంలోకి రావటంతో అల్ సునత్ మ్యారెజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో మ్యారేజి బ్యూరోను స్టార్ట్ చేశాడు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను కూడా ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ఆదాయం బాగా పెరగటంతో బాగా లాభాలు ఆర్జించాడు. ఇంతటితో ఆగకుండా మరింత డబ్బు సంపాదించాలనే తపనతో ప్రజలనుంచి డిపాజిట్లు సేకరించటం మొదలెట్టాడు.
తన మ్యారేజి బ్యూరోలో పెట్టుబడి పెడితే లాభాలు బాగా వస్తాయని ప్రకటనలిచ్చాడు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 5 వేలు రూపాయలు ఇస్తానని ఏడాది తర్వాత అసలు తీసుకోవచ్చని భరోసా కల్పించాడు. ఈ ప్రకటన చూసి ప్రజలు సంస్ధలో డబ్బు డిపాజిట్ చేయటం మొదలెట్టారు. క్రమేపీ డిపాజిట్ దారుల సంఖ్య పెరిగి 15 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చినట్లు తెలిసింది.
ఈ ఏడాది జనవరి వరకు డిపాజిట్ దారులందరికీ చెల్లిస్తూ వచ్చాడు. కొందరు డిపాజిట్ దారులు ఇటీవల అతని సంస్ధకు వెళ్లి చూడగా సంస్ధకు తాళం వేసి ఉంది. మహమూద్ భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read:బ్యాంకు రుణాలిప్పిస్తామని మోసం చేసిన పాత నేరస్థులు