కొడుకుని చంపిన కుటుంబం : ఇంట్లో తల్లితో సహా అందరిపై అత్యాచారం

మద్యానికి బానిసైన ఓ మానవ మృగం కుటుంబంపైనే కన్నేసింది. తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఇంట్లోని కన్నతల్లితో సహా సోదరి, సోదరుడి భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొడుకు దురాక్రమాలను చూసి తట్టుకోలేని కుటుంబ సభ్యులు చివరికి అతడ్ని చంపేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని దాటియా ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 24ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. తాగిన మైకంలో ఇంట్లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వావి వారసలు లేకుండా మహిళా కుటుంబ సభ్యులపై అత్యాచారం చేసేవాడు. అతడి ఆగడాలు భరించలేని కుటుంబం చివరికి 24ఏళ్ల కుమారుడిని చంపేసినట్టు దాటియా సబ్ డివిజినల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు, గీతా భరద్వాజ్ తెలిపారు. ఈ హత్య కేసులో నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గోపాల్ దాస్ హిల్స్ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని నవంబర్ 12న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అతడి గొంతు నులిమి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతుడి వివరాలను గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. నవంబర్ 11న రాత్రి సమయంలో మద్యం సేవించి ఇంట్లోకి వచ్చాడని మృతుడి తండ్రి చెప్పాడు.
తాగిన మైకంలో రెండో కుమారుడి భార్యపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని తండ్రి చెప్పాడు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇంట్లో ఆడవాళ్లపై అత్యాచారం చేశాడని, ఈసారి అతడ్ని హత్యచేసి.. గోపాల్ దాస్ కొండల్లో మృతదేహాన్ని పడేసినట్టు వివరించాడు. మృతుడి తండ్రితో పాటు తల్లి, సోదరుడు, అతడి భార్యను హత్యానేరం కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచగా.. వీరిని జ్యూడియల్ కస్టడీకి తరలించారు.