కన్నోడు కాదు కసాయోడు : పిల్లల్ని చిత్రహింసలు పెట్టి భార్యకు వీడియోలు పంపాడు

కన్నతండ్రే పిల్లల పాలిట కసాయివాడయ్యాడు. భార్య సంపాదించిన డబ్బులకు అలవాటు పడిన ఓ భర్త కన్నబిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు. కాసుల మందు కన్నబంధం ఏపాటిదనుకున్నాడో ఏమో..చిన్నారులిద్దరకి నరకాన్ని చూపెట్టిన రాక్షసత్వాన్ని వీడియో తీసి భార్యకు పంపించాడు. నువ్వు డబ్బులు పంపించకపోతే వీళ్లకు రోజు ఇదే గతి పడుతుందని భార్యను బెదిరించాడు. అంతేకాదు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సారవలో ఎలీషా నివాసముంటున్నాడు. అతని భార్య బతుకు తెరువు కోసం కన్నబిడ్డల్ని భర్త దగ్గరే వదిలి గల్ఫ్ వెళ్లింది. అక్కడ కష్టపడుతూ..ఆడ బిడ్డల బాగోగుల కోసం భర్తకు డబ్బులు పంపించేది. కానీ ఇటీవల డబ్బులు పంపించటం లేదు. దీంతో భార్య పంపించే డబ్బులకు అలవాటు పడిన ఎలీషా ఆగ్రహోద్రగృడయ్యాడు. తన ఇద్దరు పిల్లల్ని ఇష్టమొచ్చినట్లుగా బెల్ట్ తోను..సెల్ ఫోన్ వైర్లతోను ఇలా చేతికందిన వాటితో బాదాడు. వద్దు నాన్నా కొట్టొద్దు..అంటూ ఆ చిన్నారులిద్దరు వేడుకున్నా..ఆ కసాయి తండ్రి మనస్సు కరగలేదు.డబ్బుల పిచ్చి పట్టుకున్న ఆరాక్షసుడు పిల్లలిద్దరినీ చిత్రహింసలకు గురిచేశాడు. అదంతా.. వీడియో తీసి భార్యకు పంపించాడు. నువ్వు డబ్బులు పంపించకపోతే వీరిద్దరినీ ఇలాగే కొట్టీ కొట్టీ చంపేస్తానని బెదిరించాడు.
దీంతో బిడ్డలిద్దరిని చంపేస్తాడేమోననే భయంతో ఎలీషా భార్య తన బంధువులకు ఫోన్ చేసిన విషయాన్ని వివరించింది. దీంతో ఎలీషా ఇంటికి వచ్చిన బంధువులు పిల్లలిద్దరినీ తీసుకుని నర్సాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎలీషాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎలీషా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఎలీషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా..ఆ ఇద్దరు పిల్లలను పోలీసులు వారి బంధువులకు అప్పగించారు.