గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి
మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ యతీష్ దేశ్ ముఖ్ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ తెల్లవారు జామున కొలమార్క గుట్టల వద్దకు చేరుకున్నాయి.

Gadchiroli Encounter: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా రేపన్ పల్లికి సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలమార్క గుట్టల్లో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం.
మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ యతీష్ దేశ్ ముఖ్ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ తెల్లవారు జామున కొలమార్క గుట్టల వద్దకు చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తెలంగాణలోని మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి, కొమురం భీం, మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు వర్గీస్, సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్ మెంబర్లు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ మృతి చెందారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది.
ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఒక కార్బైన్, ఒక కంట్రీమేడ్ పిస్టల్, మావోయిస్టుల సాహిత్యం, ఇతర వస్తువుల స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొలమార్క గుట్టలతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భారీ ఎన్ కౌంటర్ తో సరిహద్దు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
దంతెవాడలోనూ ఎదురు కాల్పులు
దంతేవాడ, బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంపూర్ పురంగెల్ అడవుల్లో మావోయిస్టులు జవాన్ల మధ్య జరిగిన ఎదురు కాల్పులు మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. DRG దంతెవాడ, CRPF యంగ్ ప్లాటూన్ ఆధ్వర్యంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు.