పెళ్లి పేరుతో యువకులకు వల : రూ.65 లక్షలు కాజేసిన వివాహిత మహిళ

పెళ్లికాని యువకులే లక్ష్యంగా హైదరాబాద్ కు చెందిన ఒక వివాహిత మహిళ ఎన్నారై నుంచి రూ.65 లక్షల కాజేసిన వైనం వెలుగు చూసింది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో డాక్టర్ పేరుతో నకిలీ ప్రోఫైల్ క్రియేట్ చేసి అందమైన యువతుల ఫోటోలు పెట్టి ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరుణ్ వద్దనుంచి రూ.65 లక్షలు కాజేసింది మాళవిక అనే మహిళ. భర్త, అత్తమామలు, కుమారుడితో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఆమెను జూబ్లీ హిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవతి మాళవిక(44) అనే వివాహిత మహిళ అందమైన యువతుల ఫోటోలతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసేది. పెళ్లి కావల్సిన యువకులకు వల వేస్తూ వారితో మాటలు కలిపి …మాళవిక వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేది. ఈ తరహా మోసాలకు పాల్పడుతూ గతంలో 3 సార్లు అరెస్టైనా తీరు మార్చుకోకుండా మరోసారి మోసానికి పాల్పడి పోలీసులకు చిక్కింది.
ఈసారి ఆమెతో పాటు ఆమె కుమారుడు ప్రణవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పేరు మోసిన మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో మాధవనేని కీర్తి పేరుతో, డాక్టర్, జూబ్లీ హిల్స్, పేరుతో ప్రోఫైల్ క్రియేట్ చేసింది. ఈ ప్రోఫైల్ చూసి కాలిఫోర్నియాలో ఉండే వరుణ్ అనే ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వివరాలు తెలుసుకున్నాడు. దాంతో వారి మధ్య పరిచయం పెరిగి మాటలు కలిసాయి.
అప్పడుప్పుడూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఇలా ఉండగా ఒకరోజు తన తండ్రి చనిపోయాడని, తల్లి ఆస్తుల కోసం తనను వేధిస్తోందని, కోర్టులో కేసు వేసినందున కొంత ఆర్ధిక సాయం చేయమని వరుణ్ని కోరింది. లాయరు ఖర్చులు, కోర్టు ఫీజులు పేరుతో అతడి వద్దనుంచి విడతల వారీగా రూ.65 లక్షలు వసూలు చేసింది.
అయితే కొంత కాలంగా మాళవిక తనతో మాట్లడకుండా ముభావంగా ఉండటం, కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తిస్తుండటంతో అనుమానం వచ్చిన వరుణ్ తాను మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 420 తో పాటు పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేసారు.
మాళవికతో పాటు ఆమె కుమారుడు వెంకటేశ్వర ప్రణవ్ లలిత్ గోపాల్ ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె భర్త దేవతి శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. వీరిపై ఇప్పటికే మారేడ్ పల్లి, నల్లకుంట పోలీసు స్టేషన్లలో ఇదే తరహాలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.