Irrigation AEE Nikesh Kumar Case : వామ్మో.. ఈ అధికారి అక్రమాస్తులు రూ.600 కోట్లకు పైనే.. పదేళ్ల సర్వీస్ లోనే కోట్ల రూపాయలు పోగేసిన వైనం..
ఏసీబీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచింది.

Irrigation AEE Nikesh Kumar Case : ఇరిగేషన్ ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) నిఖేశ్ కుమార్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇతడి అక్రమాస్తులు రూ.600 కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. బ్యాంకు లాకర్లు బయటపడితే నిఖేశ్ అక్రమాస్తుల చిట్టా మరింత పెరగనుందని సమాచారం. బ్యాంకు లాకర్లలో ఏం బయటపడబోతోంది? అతడి అక్రమాస్తుల చిట్టా ఇంకా ఎంత పెరగబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.
సిటీలో ఖరీదైన విల్లాలు, ఎక్కడపడితే అక్కడ ప్లాట్లు సంపాదించుకుంటూ పోయాడు నిఖేశ్. వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 600 కోట్లకు పడగెత్తాడు నిఖేశ్. చేసేది ఏఈఈ ఉద్యోగమే అయినా, పట్టుమని పదేళ్లు కూడా సర్వీస్ లో లేకపోయినా.. అతడు పోగేసుకున్న ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. నిఖేశ్ కుమార్ చేసిన అవినీతి, కూడబెట్టిన అక్రమాస్తులు.. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.
నిఖేశ్ బంధువుల ఇళ్లను టచ్ చేసినా.. స్నేహితుల ఇళ్లకు వెళ్లినా.. అతగాడి ఆస్తుల లింకులు సింక్ అవుతున్నాయి. ఏసీబీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచింది. దర్యాఫ్తులో కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక, నిఖేశ్ బంధువుల లాకర్లు కూడా తెరవబోతున్నారు అధికారులు. వారి లాకర్లలో నిఖేశ్ దాచుకున్న నిధులు బయటపడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ లో అక్రమాస్తులను పోగేసిన ఏఈఈ నిఖేశ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతడిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
బఫర్ జోన్ లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి నిఖేశ్ కుమార్ భారీగా అక్రమాస్తులు పోగేసినట్లు అధికారులు గుర్తించారు. నానక్ రామ్ గూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో నిఖేశ్ కు ఖరీదైన విల్లాలు ఉన్నాయి. నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ ఉంది. మొయినాబాద్ లో ఏకంగా మూడు ఫామ్ హౌస్ లు కలిగున్నాడు. తాండూరులో నిఖేశ్ పేరు మీదు 3 ఎకరాల భూమి ఉంది. నిఖేశ్ కుమార్ బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఇప్పటికే కిలో బంగారం సీజ్ చేశారు. ఇప్పుడు ఏసీబీ అధికారుల కన్ను నిఖేశ్ బంధువల బ్యాంకు లాకర్లపై పడింది. ఆ లాకర్లను ఓపెన్ చేస్తే నిఖేశ్ అక్రమాస్తులు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. నిఖేశ్ సన్నిహితులు, బినామీల పేరు మీదున్న ఆస్తుల వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
Also Read : డెత్ మిస్టరీ..! నటి శోభిత బలవన్మరణం కేసులో వెలుగులోకి కీలక విషయాలు..