కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీ విద్యార్ధులకు తీవ్రగాయాలు

  • Published By: chvmurthy ,Published On : January 4, 2020 / 02:19 AM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీ విద్యార్ధులకు తీవ్రగాయాలు

Updated On : January 4, 2020 / 2:19 AM IST

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఏపీ కి చెందిన ఒక విద్యార్ధి మృతి చెందగా   పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విహార యాత్రకు వెళ్లినవారు విషాదంలో మునిగిపోయారు

వివరాల్లోకి వెళితే ….అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు  జనవరి 2వ తేదీన  విహార యాత్రకు బయలు దేరి వెళ్లారు.  వీరిలో  ఐదుగురు ఉపాధ్యాయులు, 45మంది విద్యార్థులు  ఉన్నారు.  శుక్రవారం రోజంతా  వీరు జోగ్‌ జలపాతం వద్ద ఆనందంగా గడిపారు. తర్వాత రాత్రిపూట బస చేసేందుకు మురిడి బయలుదేరి వెళుతుండగా మార్గంమధ్యలో బస్సు అదుపు తప్పి లోయలోకి బోల్తా పడింది.

కర్ణాటకలోని  శివమొగ్గ జోగ్‌ఫాల్స్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ విద్యార్థులలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల వెంట వెళ్లిన టీచర్‌, వంట మనిషి కూడా గాయపడినట్లు సమాచారం. డ్రైవర్‌ మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం రాజేంద్రన్‌ తెలిపారు.

ఆ దారిగుండా వెళుతున్న ఇతర వాహనాల డ్రైవర్లు సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో వారు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యాయేసుబాబుకు సమాచారం ఇచ్చారు. గాయపడినవారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అద్దాలు పగులుగొట్టి బయటకు వచ్చి కొందరు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదంలో గాయాపడిన వారు ఉడిపీ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాద ఘటనపై  ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వివరాలను సీఎంవో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గాయపడ్డ వారికి చికిత్స అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కాగా బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.