అతనికి 28, ఆమెకు 51…. పెళ్లి ఫోటోలు షేర్ చేసిందని భార్యను హత్య చేసిన భర్త

Kerala man electrocutes her 2 months after marriage : కేరళలో దారుణం జరిగింది. పెళ్లైన రెండునెలలకే భార్యకు కరెంట్ షాకిచ్చి హత్య చేశాడు ఓ యువకుడు. తన కంటే వయసుల్లో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకున్న యువకుడు తమ పెళ్లి ఫోటోలు బంధువులకు షేర్ చేసిందని భార్యను హత్య చేశాడు.
కేరళలోని కరక్కోణం ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే అరుణ్ కుమార్(28), తన తల్లి స్నేహితురాలైన శాఖా కుమారితో(51) డేటింగ్ చేశాడు. కొన్నాళ్లు తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలను కున్నారు. అక్టోబర్ 19న కొద్దిమంది సమక్షంలో ఆమె మెడలో తాళికట్టాడు. ఇద్దరి మధ్య దాదాపు 23 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్న మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నాడని మీకు అనుమానం రావచ్చు.
శాఖా కుమారి మంచి స్ధితిపరురాలు. ఆర్ధికంగా బాగా ఎదిగిన కుటుంబం. ఒంటరి మహిళ. ఆమెకు త్రెస్యాపురంలో ఎకరాల కొద్దీ భూమి ఉంది. బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు ఉన్నాయి. సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. సంపాదన బాగానే ఉంది. కావాల్సినంత సంపద ఉన్నా ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. ఆమెకు జీవితంలో ఒక తోడు కావాలి. దాని కారణంగా ఆమె అరుణ్ కుమార్ ను ఇష్టపడింది. ఆమె అవసరాన్ని అరుణ్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.
శాఖా కుమారిని చేసుకుంటే ఆమె ఆస్తి మొత్తం కొట్టేయ్య వచ్చనే ఆలోచనతో అరుణ్ ఆమె మెడలో తాళి కట్టాడు. కానీ…. తమ పెళ్లి విషయం సమాజంలో గుట్టుగా ఉంచాలని భావించాడు. అరుణ్ ను పెళ్లి చేసుకున్నతర్వాత శాఖా కుమారి చాలా సంతోషంగా ఉంది. పెళ్లి సమయంలో ఆమె రూ.10లక్షల నగదు, కారు అరుణ్ కుమార్ కు బహుమతిగా ఇచ్చింది. అరుణ్ ఉద్యోగానికి ఆస్పత్రికి వెళ్ళగానే కుమారి తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకన్న విషయం నలుగురితో చెప్పి సంతోషాన్ని పంచుకునేది. వారికి తమ పెళ్లి ఫోటోలు పంపించటం మొదలెట్టింది.
ఈవిషయం అరుణ్ కుమార్ కు తెలిసింది. పెళ్లి ఫోటోలు ఇతరులకు పంపించవద్దని భార్యతో చెప్పాడు. అయినా ఆమె తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోటానికి ఫోటోలు షేర్ చేసేది. దీంతో అరుణ్ కు కోపం వచ్చింది. తన పెళ్లి బయట సమాజానికి తెలియటం అతనికి ఇష్టం లేదు. డిసెంబర్ 26, శనివారం నాడు ఈవిషయమై ఇద్దరి మధ్య గొడవ జరగింది. కోపం పట్టలేని అరుణ్ ఆమెకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు.
తన భార్యకు షాక్ కొట్టి పడిపోయిందని చికిత్స చేయాలని వైద్యులను కోరాడు. అప్పటికే ఆమె మరణించటంతో డాక్టర్లు ఎలా చనిపోయిందని అడిగారు. ఇంట్లో డెకరేషన్ లైట్లు అమరుస్తుంటే షాక్ కొట్టి అపస్మారక స్ధితిలోకి వెళ్లిందని చెప్పాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు శాఖా కుమారికి ముఖం, చేతులు, తల భాగంలో కరెంట్ షాక్ కొట్టినట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ చెప్పే మాటలపై నమ్మకం కుదరని వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కుమార్ ను ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. వారికి కూడా అదే కధ చెప్పాడు. ఇంట్లో డెకరేషన్ లైట్లు అమరుస్తుండగా షాక్ కొట్టి పడిపోయిందనే చెప్పాడు. విచారణలో భాగంగా పోలీసులు ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించి మరికొంత సమాచారం సేకరించారు.
అతడు చెపుతున్న మాటలకు, అక్కడ ఉన్న పరిస్ధితులకు పొంతన కుదరక …అరుణ్ కుమార్ ను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లి తమదైన స్టైల్లో విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. తానే కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.