పెళ్లికి నిరాకరించారని లవర్స్ సూసైడ్

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటాపురంలో వేర్వేరు కులాలకు చెందిన శిల్ప (17), మల్లేష్ (20) ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల్లో చెప్పారు. వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి వీలు కాదని ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు. ఇద్దరికీ వేర్వేరు సంబంధాలు చూస్తున్నారు.
ఈనేపథ్యంలో పెద్దలు పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో శిల్ప, మల్లేష్ గురువారం (ఏప్రిల్ 18, 2019) తెల్లవారుజామున ఊరి చివరికి వెళ్లారు. పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.