పెద్దలకు తెలియకుండా పెళ్లి…మరో పెళ్లి ఖాయం అయ్యేసరికి సూసైడ్

  • Published By: murthy ,Published On : June 5, 2020 / 02:59 AM IST
పెద్దలకు తెలియకుండా పెళ్లి…మరో పెళ్లి ఖాయం అయ్యేసరికి సూసైడ్

Updated On : June 5, 2020 / 2:59 AM IST

రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్ల గ్రామంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.  ఇంట్లో పెద్దలకు తెలియకుండా కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆవిషయాన్ని వాళ్లకు చెప్పకుండా దాచి పెట్టింది. ఇప్పుడు ఇంట్లో పెద్దలు వేరే పెళ్లి సంబంధం ఖాయం చేయటం, మొదటి వివాహానికి చెందిన ఫోటోలను భర్త వాట్సప్ గ్రూప్ లో  పోస్ట్ చేయటంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. 

కుదురుమళ్ల గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కూతురు స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. సొంత గ్రామానికి చెందిన తిరుపతయ్య స్రవంతి, మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. ఈవిషయాన్ని ఇరు వైపులా కుటుంబీకులకు చెప్పకుండా రహస్యంగానే ఉంచారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్రవంతి మహబూబ్ నగర్ నుంచి సొంత గ్రామానికి వచ్చి పేరెంట్స్ దగ్గర ఉంటోంది. ఈ క్రమంలో కూతురుకి పెళ్లి చేయాలని శైలేందర్ సంబంధాలు చూడటం మొదలెట్టాడు. రెండు రోజుల క్రితం ఆమెకు కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. దీంతో కుటుంబీకులు జూన్30న పెళ్లికి ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

ఈ విషయం తెలుసుకున్న స్రవంతి భర్త తిరుపతయ్య….ఇప్పుడు స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి వద్దకు వెళ్లి తాను, స్రవంతి ఇదివరకే ప్రేమించి పెళ్లి చేసుకున్నవిషయం చెప్పాడు. అందుకు సాక్ష్యాలుగా అప్పుడు దిగిన ఫోటోలను వారికి చూపి వాట్సప్ లో పోస్టు చేశాడు. ఈవిషయం తెలిసి అబ్బాయి తల్లితండ్రులు స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన స్రవంతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.  కాగా..స్రవంతి తిరుపతయ్యల పెళ్లికి అదే గ్రామానికి చెందిన కొస్గి వెంకటయ్య అనే వ్యక్తి సహకరించాడు. స్రవంతి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతయ్య. వెంకటయ్యలపై కేసు నమోదు చేసిన పోలీలసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read: పిల్లలను కాల్వలో ముంచి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ