విద్యార్థి మృతదేహాంతో ధర్నా..తల్లిదండ్రులను బూటు కాలితో తన్నిన పోలీసులు

ఏదైనా ఆందోళనలు, నిరసనలు జరిగితే..పోలీసులు ఏం చేస్తారు. ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. శాంతిభద్రతను కాపాడేందుకు యత్నిస్తుంటారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పమైంది. తమ కూతురు చనిపోయింది..దీనికి కారణం కాలేజీ యాజమాన్యమే..అంటూ..తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అయితే..మృతురాలి తల్లిదండ్రులను బూటు కాలితో తన్నడం వివాదాస్పమైంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే…
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఏరియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్, పద్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం నారాయణ జూనియర్ కాలేజీలో సంధ్యా రాణి అనే మొదటి సంవత్సరం విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు మరణించిందని సంధ్యారాణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తమ కుమార్తె జ్వరం వచ్చి ఇబ్బంది పడుతుంటే.. తమను కలవనీయకుండా చేయడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రి ముందు మృతదేహంతో 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. దీంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు సహనం కోల్పోయి మృతురాలి తల్లిదండ్రులను బూటుకాలితో తన్నారు. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించడంతో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read More : ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్