వీడిన మర్డర్ మిస్టరీ.. హంతకురాలిని పట్టించిన ఆర్టీసీ జీరో టికెట్.. అసలేం జరిగిందంటే..

అంజమ్మ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, తిరిగి రాలేదని తెలిపారు. ఆమెతో ప్రయాణించిన మరో మహిళ..

వీడిన మర్డర్ మిస్టరీ.. హంతకురాలిని పట్టించిన ఆర్టీసీ జీరో టికెట్.. అసలేం జరిగిందంటే..

Updated On : November 24, 2024 / 12:16 AM IST

Rtc Zero Ticket Caught Killer : ఆర్టీసీ జీరో టికెట్ ఓ హంతకురాలిని పట్టించింది. చనిపోయిన మహిళ ఎవరు, ఆమెను చంపింది ఎవరు అని తెలుసుకోలేక, కేసులో మిస్టరీని చేధించలేక తీవ్ర తంటాలు పడుతున్న పోలీసులకు జీరో టికెట్ సాయం చేసింది. జీరో టికెట్ ఆధారంగా మృతురాలిని గుర్తించిన పోలీసులు నిందితురాలిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న బహుదూర్ పల్లిలోని నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన అంజమ్మగా గుర్తించారు. నగల కోసం అంజమ్మను మరో మహిళ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితురాలు గంగామణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 14న దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి కాకతీయ లేఔట్ లోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ శవం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాఫ్తు చేపట్టగా.. మృతురాలు ఆర్టీసీ బస్సు దిగి ఘటనా స్థలానికి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

చనిపోయిన మహిళ గండి మైసమ్మ దగ్గర ఆర్టీసీ బస్సు దిగినట్లు గుర్తించిన పోలీసులు.. బస్సు నెంబర్ ఆధారంగా దర్యాఫ్తు జరిపారు. బస్సులో మహిళ తీసుకున్న జీరో టికెట్ ఆధారంగా ఆమె ఆధార్ కార్డు సాయంతో ఆమె ఎక్కడ బస్సు ఎక్కింది అనే కోణంలో ఎంక్వైరీ ముమ్మరం చేశారు. నిజామాబాద్ లో ఆమె బస్సు ఎక్కినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ బస్సు ఎక్కే టైమ్ లో సీసీ కెమెరాలు పరిశీలించగా.. మృతురాలితో పాటు మరో మహిళ బస్సు ఎక్కుతున్నట్లు, ఆ తర్వాత దిగిన చోటు కూడా ఇద్దరూ కలిసి వెళ్లినట్లు గుర్తించారు.

మృతురాలు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన అంజమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అంజమ్మ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, తిరిగి రాలేదని తెలిపారు. ఆమెతో ప్రయాణించిన మరో మహిళ పేరు అదే ప్రాంతానికి చెందిన గంగామణిగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది.

మృతురాలి మెడలో ఉన్న ఆభరణాలను చూసి ఆశ పడిన గంగామణి.. ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ చేసింది. తమ బంధువుల ఇంటికి వెళ్లొద్దాం అంటూ అంజమ్మతో నమ్మబలికి నిజామాబాద్ నుంచి ఆమెను వెంటబెట్టుకుని తీసుకొచ్చింది గంగామణి. గండిమైసమ్మలోని బస్టాండ్ దగ్గర కల్లు తాగించి బహదూర్ పల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అనంతరం వెంట తెచ్చుకున్న కర్రతో అంజమ్మను కొట్టి చంపింది.

నిందితురాలు గంగామణిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెపై నిజామాబాద్ లో పలు చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. వృద్ధురాలిని చంపి కాజేసిన 2లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను గంగామణిని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ కు తరలించారు.

Also Read : సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం