లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 10:15 AM IST
లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

Updated On : November 27, 2019 / 10:15 AM IST

లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.

కరీంనగర్ జిల్లాలో లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కూతురు వరుస అయిన మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు సగరం రాజు (43)కు జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి, జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తీర్పు ఇచ్చారు. 

వివరాల్లోకి వెళితే… వేములవాడ పట్టణంలో మహిళ (38) తల్లిదండ్రులు మృతి చెందడంతో తమ్ముడితో కలిసి ఉంటుంది. తమ్ముడు ఆలయంలో పనికి వెళ్తుండగా, ఆమె ఇంట్లోనే ఉంటుంది. దీనిని అలుసుగా తీసుకున్న తిప్పాపూర్‌కు చెందిన సమీప బంధువు సగరం రాజు.. కూతురు వరుస అయిన మహిళను తరచూ వస్తుండేవాడు. ఒంటరిగా ఉన్న ఆమెతో చనువు పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. 

ఆమె గర్భం దాల్చిన విషయం రాజుకు తెలుపగా కొన్ని మాత్రలు తీసుకువచ్చి ఇచ్చాడు. అయినా గర్భం పోకపోగా నొప్పి రావడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తమ్ముడికి తెలిపింది. ఈ ఘటనపై (డిసెంబర్ 4, 2016) వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ శ్రీనివాస్ దర్యాప్తు జరిపారు. 

ఈ కేసులో సాక్షులను ఏపీపీ మధుకర్‌రావు విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడు సగరం రాజుకు జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధించారు. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.