తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

శంషాబాద్ బెంగుళూరు హైవేపై సాతంరాయి వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు.. రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిన దుర్ఘటనలో స్పాట్‌లోనే అతడు మృతి చెందాడు.

తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

Telangana Road Accidents claims 4 lives on Monday

Updated On : August 12, 2024 / 3:38 PM IST

Telangana Road Accidents: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది గాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడ‌ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకుపై ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా.. కొత్వాల్‌గూడ‌ చెన్నమ్మ హోటల్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టి స్తంభాన్ని గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు క్రాస్ చేస్తుండగా..
శంషాబాద్ బెంగుళూరు హైవేపై సాతంరాయి వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు.. రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిన దుర్ఘటనలో స్పాట్‌లోనే అతడు మృతి చెందాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బండ్లగూడలో ఇద్దరు దుర్మరణం
పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు చంద్రయాణాగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో షాదన్ హోటల్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also Read: భార్య మోసం, ప్రాణస్నేహితుడి వెన్నుపోటు.. విశాఖలో విషాదం

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్ర శివారు ప్రాంతంలోని మూల మలుపు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్సత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.