మంత్రి భార్యకు తప్పని గృహ హింస.. రక్షించమని మోదీకి లేఖ

తన భర్త నుంచి కాపాడాలని ఓ మంత్రి భార్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ను వేడుకుంది. ఈ మేరకు ఆమె వారిద్దరికీ లేఖలు రాసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మంత్రి రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ భర్త వేధింపులు తట్టుకోలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి మంత్రి బాబూరామ్ వేధింపులు ఎక్కువయ్యాయని గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి విలపించింది.
నన్ను తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నించారని అమె తెలిపింది. భర్త పెట్టే వేధింపుల మీద ఆమె పోలీసు స్టేషన్లో కంప్లయింట్ చేసినప్పటికీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తప్పించుకునే వాడని ఆమె చెప్పింది.
సమస్యను పరిష్కరించుకుందామని ప్రయత్నించినప్పటికీ తనను శారీరకంగా హింసించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్ధానిక పోలీసులు కూడా మంత్రిపై చర్యలు తీసుకోటానికి భయపడుతున్నారని ఆమె ఆరోపించారు. అందుకే తాను నేరుగా ప్రధానికి, సీఎంకు లేఖ రాసానని ఆమె విలేకరులకు తెలిపారు.