వర్షిత హత్యాచారం కేసు : రఫీ మానసిక వ్యాధిగ్రస్తుడు

  • Published By: chvmurthy ,Published On : November 16, 2019 / 10:42 AM IST
వర్షిత హత్యాచారం కేసు : రఫీ మానసిక వ్యాధిగ్రస్తుడు

Updated On : November 16, 2019 / 10:42 AM IST

చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో నిందితుడు రఫీని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హంతకుడు బసినికొండకు చెందిన లారీ క్లీనర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. రఫీ చిన్నపిల్లలపై అత్యాచారం చేసే మానసికవ్యాధిగ్రస్తుడని ఆయన తెలిపారు. రఫీపై ఇంతకుముందు రెండు సార్లు చిన్నపిల్లలపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చాడని అన్నారు.

సీఎం జగన్‌ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మదనపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన చిన్నారి వర్షిత (6) తల్లిదండ్రులతో కలిసి బుధవారం(నవంబర్ 6,2019) రాత్రి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. అక్కడకు వచ్చిన రఫీ చిన్నారి వర్షితను ఫోటోలు తీసి మాయమాటలతో కళ్యాణ మండపం నుంచి  బయటకు తీసుకువెళ్లాడు. పెళ్ళి మంటపం నుంచి ఇంటికెళ్లే క్రమంలో వర్షిత తప్పి పోయినట్లు  తల్లి తండ్రులు  గుర్తించారు. 

కాగా.. శుక్రవారం(నవంబర్ 8,2019) ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో వర్షిత మృతదేహం లభించింది. 

పోస్టుమార్టంలో సంచలన విషయం వెలుగుచూసింది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న మదనపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఫంక్షన్ హాల్ లోని సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. రఫీపై పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు.