వివేకా మర్డర్ మిస్టరీ : హైకోర్టును ఆశ్రయించిన సౌభాగ్యమ్మ

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 08:01 AM IST
వివేకా మర్డర్ మిస్టరీ : హైకోర్టును ఆశ్రయించిన సౌభాగ్యమ్మ

Updated On : March 25, 2019 / 8:01 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ?  ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సిట్ విచారణపై నమ్మకం లేదని..సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు వివేకా కుటుంబసభ్యులు. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై వివేకా భార్య సౌభాగ్యమ్మ మరో పిటిషన్ దాఖలు చేసింది. 

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని..వాస్తవాలు వెలుగులోకి రావాలని పిటిషన్‌లో కోరారు సౌభాగ్యమ్మ. జగన్ పిటిషన్ వేసి మూడు రోజులవుతున్నా నంబరింగ్ కాకపోవడంతో మరో పిటిషన్ దాఖలు చేశారు. సౌభాగ్యమ్మ వేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపనుంది. ఈ కేసులో వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. వివేకానంద కుమార్తె ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కలిసిన సంగతి తెలిసిందే. సిట్ చేత విచారణ చేయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తుందని, సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. తండ్రిని ఎవరు చంపారో  తెలియడం లేదని, సిట్ అధికారులపై నమ్మకం లేదని సీబీఐ చేత విచారణ చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

మరోవైపు తన తండ్రి హత్యలో  సీఐ శంకరయ్య హస్తం కూడా ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత. ఈ కేసులో ఇంతవరకూ ఎలాంటి క్లూ దొరకలేదని, దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు సునీత. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికి పలువురిని విచారించినా.. వివేకాను చంపిందెవరో? అందుకు కారకులెవరో మాత్రం కనిపెట్టలేకపోయింది. ఇప్పటికీ అది సస్పెన్స్ గానే మిగిలింది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి తరుణంలో సునీతా చేసిన ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి.

వివేకా హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య.. అక్కడ సాక్ష్యాధారాలను మార్చేసినా. శవ పంచనామా కాకుండా పులివెందుల ప్రభుత్వాస్పత్రికి వివేకాను తరలించినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే  ఆరోపణతో ఆయనపై ఇటీవల వేటు వేశారు ఉన్నతాధికారులు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.