బాబోయ్.. లాకర్లలో ఉంచిన రూ.13కోట్ల విలువైన బంగారం చోరీ.. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో దొంగల బీభత్సం..

దాదాపు 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కేజీల బంగారం దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

బాబోయ్.. లాకర్లలో ఉంచిన రూ.13కోట్ల విలువైన బంగారం చోరీ.. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో దొంగల బీభత్సం..

Updated On : November 20, 2024 / 6:00 PM IST

Rayaparthy SBI Bank Robbery : వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో నిన్న జరిగిన దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చోరీ చేసినట్లుగా భావిస్తున్న పోలీసులు.. దొంగల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మూడు వారాల క్రితం ఇదే తరహాలో కర్నాటకలోని దావణగెరె జిల్లాలో చోరీ జరిగింది. దీంతో అదే ముఠా ఇక్కడ రెక్కీ నిర్వహించి మరీ చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో ఇనుప కిటికీలను గ్యాస్ కట్టర్ తో తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. లాకర్లలో ఉంచి రూ.13 కోట్ల విలువైన 19 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు.

దాదాపు 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కేజీల బంగారం దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చోరీ ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ముఠాను పట్టుకునేందుకు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వరుస చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నిన్న వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో దొంగలు పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. దాదాపు 500 మంది కస్టమర్లకు సంబంధించిన 19 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీని విలువ 14 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు పోలీసులు.

రెక్కీ నిర్వహించిన దొంగలు.. సినీ ఫక్కీలో దొంగతనం చేశారు. గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీలు తొలగించారు. బ్యాంకులో ఉన్న అలారం మోగకుండా ముందుగానే వైర్లు కట్ చేశారు. ఇక, సీసీ కెమెరాలను ధ్వంసం చేసేశారు. ఫుటేజీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇలా ఎంతో పకడ్బందీగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్బీఐలో బ్రాంచులో జరిగిన ఈ భారీ చోరీ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

మూడు వారాల క్రితం అచ్చం ఇదే తరహాలో కర్నాటక రాష్ట్రం దావణగెరెలో బ్యాంకులో దోపిడీ జరిగింది. అదే ముఠా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ చోరీ.. ప్రొఫెషనల్ దొంగల ముఠా పనే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : ఆ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు