భార్యను దారుణంగా చంపి, సంప్‌లో పడేసి : భర్త కిరాతకం

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 04:51 AM IST
భార్యను దారుణంగా చంపి, సంప్‌లో పడేసి : భర్త కిరాతకం

Updated On : January 24, 2019 / 4:51 AM IST

హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌లో దారుణం జరిగింది. భార్యను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన భర్త ఘాతుకం వెలుగుచూసింది. భార్యను అతడు చంపిన తీరు కలకలం రేపుతోంది. మూడు  రోజుల క్రితం భార్యను చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశాడు భర్త.

 

మృతురాలి పేరు షాజియాబేగం. మియాపూర్ సమీపంలోని హఫీజ్పేట్‌కు చెందిన తాజ్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు సంతానం. ఆరేళ్ల తహ, నాలుగేళ్ల తల్హా, రెండేళ్ల ఇబ్రహీంలు ఉన్నారు. ఇటీవల కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త తాజ్, అత్తింటివారంతా షాజియాను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించినా ఓర్పుతో అన్నీ భరించింది షాజియా అని బంధువులు చెబుతున్నారు. మూడ్రోజుల క్రితం షాజియాబేగంపై కత్తులతో దాడి చేసి.. ఆమెని చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

 

నీళ్ల సంపులో ఉన్న షాజియాబేగం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. షాజియా బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. ఇంటిపై, కారుపై రాళ్లదాడి చేశారు. అంతకుముందే భర్త, అతని కుటుంబీకులు పరారయ్యారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. షాజియా  శరీరంపై కత్తితో దాడి చేసిన గాయాలున్నాయని చెబుతున్నారు మృతురాలి బంధువులు.

 

షాజియాది హత్యా.. లేక ప్రమాదమా అనేది విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నామని  పోలీసులు తెలిపారు.

 

* హఫీజ్ పేట్‌లో మహిళ దారుణ హత్య
* భార్యను చంపి మృతదేహాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త
* మూడు రోజులుగా సంపులో భార్య మృతదేహం
* మృతదేహం మాయం చేసేందుకు  భర్త విఫలయత్నం
* హఫీజ్‌ పేట్‌కు చెందిన తాజ్‌ ఘాతుకం
* భార్య షాజియాబేగంను కిరాతకంగా చంపిన భర్త తాజ్‌
* పరారీలో భర్త తాజ్‌, అత్తమామలు