పరువు హత్య : కూతుర్ని ప్రేమించాడని యువకుడిని హత్య చేసిన కుటుంబం

  • Published By: murthy ,Published On : June 7, 2020 / 03:46 AM IST
పరువు హత్య : కూతుర్ని ప్రేమించాడని యువకుడిని హత్య చేసిన కుటుంబం

Updated On : June 7, 2020 / 3:46 AM IST

ప్రియురాలి ఇంట్లో ఎవరూ లేరనుకుని ఆమె ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ప్రియుడి ఉదంతం తమిళనాడులో వెలుగు చూసింది.తన కుమార్తెను ప్రేమించాడనే కారణంతో యువకుడిని దారుణంగా హత్యచేసింది ఆ కుటుంబం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు పరువు హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. ఇంకా అదే  పరిస్ధితి రాష్ట్రంలో కొనసాగుతోందనటానికి ఇదో ఉదాహరణ.

కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన ఆర్ముగం కుమారుడు అన్బళగన్(21) లోకల్ గా ఒక కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన బాబు కుమార్తె శ్వేత(18)తో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈమధ్య ప్రేయసి ప్రియులు కలుసుకోలేక పోతున్నారు.

ఈ క్రమంలో ఒకరోజు శ్వేతను  చూడటానికి  ఆమె ఇంటివద్దకు వెళ్లాడు. అన్బళగన్ ను చూసిన శ్వేత కుటుంబీకులు అతడ్ని మందలించి పంపించారు. ప్రియురాలిని చూడలేక పోయాననే బాధతో ఉన్న ప్రియుడు మరోసారి ఆమె ఇంటి వద్దకు వెళ్లి వారి చేతిలో చావు దెబ్బలు తిని వచ్చాడు. అయినా ప్రియురాలిపై మనసు లాగేస్తుంటే .. ఆమెను చూడాలనే కోరికతో… శుక్రవారం జూన్ 5వ తేదీ సాయంత్రం ఆమె ఇంటివద్దకు వెళ్ళాడు.

ఇంట్లో ఎవరూ లేరనే సమాచారంతో లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ ఊహించని విధంగా శ్వేత తల్లి,తండ్రి, సోదరుడు ఉండటం చూసి షాక్ కుగురయ్యాడు. అప్పటికే రెండు, మూడు సార్లు తమ పిల్లను మర్చిపొమ్మని  చెప్పిన కుటుబం సభ్యులు  అన్బుళగన్ ఇంటికి వచ్చే సరికి కోపోద్రిక్తులయ్యారు.

ఇంట్లోకి వచ్చిన అతడ్ని కుటుంబ సభ్యులు దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగులో పడిఉన్న అక్కడే వదిలేసి…తమ కుటుంబం పరువు బజారు కీడుస్తున్నాడన్న కోపంతోనే హత్యచేసినట్లు ఒక లేఖ ఘటనా స్ధలంలో పడేసి ఆకుటుంబం ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

ఆ ఇంటి నుంచి రక్తం వాసన వస్తుండడాన్ని పసిగట్టిన పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా వారికి మృతదేహం కనపడింది. వారు వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అక్కడ లభించిన లేఖ ఆధారంగా ప్రేమ పరువు హత్యగా తేల్చారు. బాబు(40), ఆయన భార్య సత్య (37), కుమారుడు జీవ(17), శ్వేత(18)పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఈ నలుగురి కోసం గాలిస్తున్నారు.