పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. రూపాయి కట్టక్కర్లేదు.. నోటిఫికేషన్ జారీ.. 12నుంచి దరఖాస్తులు..
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ..

AP RTE Admission 2025
AP RTE Admission 2025: ఏపీలోని పేద విద్యార్థులకు శుభవార్త. ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా విద్యను అభ్యసించేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించి విద్యాహక్కు చట్టం కోటా సీట్ల భర్తీకి అదనపు నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యనందించేందుకు 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ సీట్ల భర్తీకోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 1వ తరగతిలో కేటాయించిన 25శాతం సీట్లలో మిగిలిన ఖాళీల భర్తీకి అదనపు నోటిఫికేషన్ విడుదలైంది.
ఆసక్తి గల అభ్యర్థులు అడ్మీషన్ల కోసం ఆగస్టు 12 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇది కొనసాగింపుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో ధరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు..
♦ దరఖాస్తుల స్వీకరణ : ఆగస్టు 12 నుంచి 20 వరకు
♦ అర్హత నిర్ధారణ : ఆగస్టు 21
♦ లాటరీ ఫలితాలు : ఆగస్టు 25
♦ అడ్మిషన్ ఖరారు : ఆగస్టు 31
ఆర్‌టీఈ చట్టం ఏం చెబుతుందంటే?
విద్యాహక్కు చట్టం (RTE) 2009 ప్రకారం.. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. ఈ చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం.. ప్రైవేట్ స్కూళ్లు తమ 1వ తరగతి సీట్లలో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాల (SC, ST, BC), ఆర్థికంగా బలహీన వర్గాల (EWS), అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగ పిల్లల కోసం రిజర్వ్ చేయాలి. ఈ సీట్ల కేటాయింపు లాటరీ విధానం ద్వారా జరుగుతుంది. ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 నుంచి అమలులో ఉంది. మరోవైపు ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ 2025 కూడా విడుదలై.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
అర్హతలు..
పిల్లల వయస్సు : రాష్ట్ర సిలబస్ స్కూళ్లకు జూన్ 1, 2025 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి కావాలి. CBSE (Central Board of Secondary Education), ICSE, IB స్కూళ్లకు ఏప్రిల్ 1, 2025 నాటికి 5 సంవత్సరాలు ఉండాలి.
ఆర్థిక పరిస్థితులు : కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5లక్షలకు మించకూడదు.
నివాసం : దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉండాలి.