SI Exam వాయిదా ?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ (సబ్ ఇన్స్‌పెక్టర్) పరీక్ష వాయిదా పడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థుల డిమాండ్ అలా ఉంది. శారీరక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. వీరంతా ఏప్రిల్ 20వ తేదీన రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మంచి మార్కులతో పాస్ కావాలని అభ్యర్థులు తెగ కష్టపడుతున్నారు. అయితే..ఇదే సమయంలో ఎన్నికలు వస్తున్నాయి. వెంటనే విధుల్లోకి రావాలని డీజీపీ ఆఫీసు నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పరీక్షలు వాయిదా పడడానికి కారణం ఏంటీ అనే డౌట్ కలుగుతుంది. ఎందుకంటే ఈ పరీక్షను సొంత డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు కూడా రాస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని బెటాలియన్లు, పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న హోం గార్డులు, కానిస్టేబుళ్లలో 30 ఏళ్ల లోపు వయస్సున్న వారున్నారు. వీరంతా ఎస్.ఐ కావాలని ఆశ పడుతున్నారు. అందుకోసం కష్టపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం కొందరు విధులకు హాజరు కాక పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీరందరికీ సెలవులు ఇవ్వడం లేదని..వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీలోగా విధుల్లో చేరాలని నోటీసుల్లో స్పష్టం చేయడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి వారిలో నెలకొంది.
కనీసం తమకు ప్రిపరేషన్ కోసం సెలవు ఇవ్వకపోతే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పీజీలు, పీహెచ్‌డీ చేసిన వారు కానిస్టేబుళ్లు, హోంగార్డులుగా పనిచేస్తున్నారు. సొంత డిపార్ట్ మెంట్ సహకారం లేకపోవడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. ఏప్రిల్ 14వ తేదీన ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు పదోన్నతికి సంబంధించిన శిక్షణ కూడా కొనసాగనుంది. ఏప్రిల్ 11 ఎన్నికల కోసం బందోబస్తు, 14న పదోన్నతి శిక్షణ, 20, 21న ఎస్ఐ రాత పరీక్షలు ఉండడం వల్ల తమకు చదువుకొనేందుకు సమయం లేదని వారు వెల్లడిస్తున్నారు.
అందుకే ఎస్ఐ పరీక్షను కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండడ్ చేస్తున్నారు. అంది వచ్చిన అవకాశం మరోసారి రాదని..వయస్సు కూడా దాటిపోతున్న సమయంలో ఎస్ఐ కావాలని కలలు కంటున్న వారి ఆకాంక్షలను పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు అర్థం చేసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.