‘మొంథా’ తుఫాను బీభత్సం: వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. పంట నష్టంతో రైతుల ఆవేదన

'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి నిమ్మవాగులో ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. భారీ వర్షంలో నిర్లక్ష్యంగా వాగు దాటేందుకు ప్రయత్నించిన డ్రైవర్, వాహనాన్ని వాగులోకి నడపడంతో వరద ఉద్ధృతికి డీసీఎం వాహనం పూర్తిగా గల్లంతైంది.

  • Published By: Mahesh T ,Published On : October 29, 2025 / 06:56 PM IST

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో ఉన్న నిమ్మవాగును దాటేందుకు ఒక డీసీఎం వాహనం డ్రైవర్ ప్రయత్నించాడు. అక్కడి స్థానికులు ఆపమని ఎంత చెప్పినా వినకుండా, వాహనాన్ని వాగులోకి నడిపాడు. కొంతదూరం వెళ్లగానే వరద తీవ్రత ఒక్కసారిగా పెరిగి, వాహనం పూర్తిగా వాగులో కొట్టుకుపోయింది. వాహనం నుంచి బయటపడేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ, వరదలో కనిపించకుండా పోయాడు. అతను గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రమైన పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట పొలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.