మందు బాబులు ఖుషీ..డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్

  • Published By: chvmurthy ,Published On : February 11, 2020 / 02:02 AM IST
మందు బాబులు ఖుషీ..డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్

Updated On : February 11, 2020 / 2:02 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  వైరస్  భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్  దెబ్బకు సిలికాన్ సీటి  బెంగుళూరు కూడా వణుకుతోంది.  coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని  బెంగళూరులో ట్రాఫిక్‌ పోలీసులు కూడా హడలిపోతున్నారు. నగరంలో  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు.  వారాంతాల్లో  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల  ఆగడాలకు చెక్ పెట్టే పోలీసులుకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్  నిర్వహించవద్దని ఆదేశాలు అందాయి. 
 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  నిర్వహించేటప్పుడు  వాహనదారుల నోట్లో గొట్టం పెట్టి గాలిని ఊది ఆల్కోమీటర్‌ ద్వారా మద్యం తాగిందీ.. లేనిదీ పరిశీలిస్తారు. ఇలా అనేకమంది గాలిని ఊదడం వల్ల క్రిములు ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముందని భావించారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు.

అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా  వాహనదారుడు మద్యం సేవించాడో లేదో పరీక్షించి… ఇతర మార్గాల ద్వారా  వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు సూచించారు.   ఏది ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిచిపోవటంతో బెంగుళూరులో మందు బాబులు ఖుషీ అవుతున్నారు.

చైనాలోని వూహాన్ నగరంలో  మొదలైన కరోనావైరస్  బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1,018 కి చేరింది. మొత్తం  43 వేల 100 కేసులు నమోదు కాగా అందులో 7 వేల 345 మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో  1,016 మంది మరణించగా, 42, 638 కేసులు నమోదు అయ్యాయి.  చైనాలో  ఫిబ్రవరి  10వతేదీ సోమవారం ఒక్కరోజే 108 మంది మరణించారు.  కరోనా వైరస్ 28 దేశాలకు విస్తరించింది.