కేసీఆర్ వరాలు: కిడ్నీ బాధితులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మానవతా ధృక్ఫథంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై టీ.ఎస్.ఆర్టీసీ బస్సుల్లో కిడ్నీ పేషంట్లకు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. ఇటీవలే మరుగుజ్జులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించడం జరిగిందని, ఇదే క్రమంలో కిడ్నీ బాధితులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు.
ఆరోగ్య శ్రీ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్న7వేల 600 మంది కిడ్నీ బాధితులు దీనివల్ల లబ్ది పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జి.ఒ. ఎం.ఎస్ -97 ప్రకారం తెలంగాణలోని ఆయా జిల్లాలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కిడ్నీ పేషంట్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండంటంతో ఏర్పడే రూ. 12.22 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ కింద తిరిగి చెల్లించనున్నారు.