కరోనా వ్యాక్సిన్‌కు 2021 వరకు ఆగాల్సిందే.. Moderna

Moderna : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దశకు చేరుకున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
రష్యా అభివృద్ధి చేసిన స్ప్నుతిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ దశలోనే పంపిణి చేసేందుకు రెడీ అయింది. రష్యా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదో అనేదానిపై వ్యతిరేకత ఎదురైంది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే 2021 తొలి త్రైమాసికం (ఏప్రిల్ తర్వాత) వరకు ఆగాల్సిందేనని Moderna స్పష్టం చేసింది.
తమ కంపెనీ కరోనా వ్యాక్సిన్ అందరికి పంపిణీ చేయాలంటే కనీసం 2021 స్ప్రింగ్ (వసంత కాలం) వరకు రెడీ అయ్యే అవకాశం ఉందని Moderna సీఈఓ Stéphane Bancel పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అత్యవసరంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోరలేమని ఆయన అన్నారు. నవంబర్ 25 వరకు అంతకంటే ముందే ఆరోగ్య కార్యకర్తలకు, ఇతరులకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యపడదని, అది ప్రమాదం కూడా అని బన్సెల్ తెలిపారు.
వచ్చే 2021 జనవరి ఆఖరి వరకు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు FDA ఆమోదం కోసం తమ కంపెనీ కోరదని అన్నారు. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాతే అప్రూవల్ కోసం వెళ్తామని స్పష్టం చేశారు. అలా చేయాలంటే కనీసం మార్చి లేదా ఏప్రిల్ తర్వాతే FDA ఆమోదం కోరతామని బన్సెల్ స్పష్టం చేశారు.
Moderna కంపెనీ ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ 2021 తొలి త్రైమాసికం తర్వాత అంటే రెండో త్రైమాసికంలో ఆరంభంలో వ్యాక్సిన్ FDA ఆమోదం కోరడం సరైన సమయమని భావిస్తున్నామని బన్సెల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం చివరి టెస్టింగ్ దశలో ఉన్న నాలుగు కరోనా వ్యాక్సిన్లలో Moderna వ్యాక్సిన్ ఒకటి.
ఇప్పటికే ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా ప్రయోగ కరోనా వ్యాక్సిన్ 100 మిలియన్ల డోస్ లను ఆర్డర్ చేసింది.. ఒక్కో డోస్ 15 డాలర్లు లేదా 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆఖరిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వచ్చే 2021 రెండో త్రైమాసికం లేదా మూడో త్రైమాసికం వరకు అందుబాటులోకి రాదని స్పష్టం చేసింది.