గుడ్ హెల్త్ : కోడిగుడ్లతో ఆరోగ్యం

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 01:57 PM IST
గుడ్ హెల్త్ : కోడిగుడ్లతో ఆరోగ్యం

Updated On : January 26, 2019 / 1:57 PM IST

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చంటారు. అదే విధంగా రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. కోడిగుడ్లలో ప్రొటీన్లే కాదు, అనేక రకాల ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందుకే పూర్తి ఆరోగ్యం పొందాలంటే రోజుకి రెండు కోడిగుడ్లు తినమని సూచిస్తున్నారు.
రోజుకి కేవలం రెండు కోడిగుడ్లు తీసుకొంటే శరీరం అద్భుతంగా పని చేస్తుంది. కోడిగుడ్ల సాటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకున్న వాళ్లు మిగిలిన రోజులో కేలరీలు తక్కువగా తీసుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు. కోడిగుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. మెదడుకు చురుకుదనం పెంచుతుంది. మనకు కావాల్సిన సెలీనియంలో 44 శాతం ఈ రెండు కోడిగుడ్ల నుంచి పొందవచ్చు. 

కోడిగుడ్లలో జంతు సంబంధ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. 
శరీరంలో అన్ని రకాల కణజాలాల తయారీకీ ఇది ఉపయోగపడుతుంది. 
కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. 
కోడిగుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. 
రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ని తగ్గిస్తాయి. 
గుండెజబ్బులు, స్ట్రోక్ రిస్కు 10 శాతం తగ్గుతుంది. 

కణత్వచాల తయారీకి అవసరమయ్యే ఫాస్ఫోలిపిడ్స్ ను తయారు చేసే కోలిన్ కోడిగుడ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తికి, కండరాల నియంత్రణను కంట్రోల్ చేసే న్యూరో ట్రాన్స్ మీటర్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది. మనం రోజులో తీసుకోవాల్సిన కోలిన్లో 50 శాతం వరకు ఈ రెండు కోడిగుడ్ల ద్వారా వస్తుంది. కోడిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది. రెండు కోడిగుడ్ల ద్వారా మనకు 18 శాతం విటమిన్ బి12 అందుతుంది. కోడిగుడ్లలో ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల కోసం కావాల్సిన ఫాస్ఫరస్ ఉంటుంది. రెండు కోడిగుడ్లతో 18 శాతం ఫాస్ఫరస్ లభిస్తుంది.